ప్రకాశం జిల్లా దర్శిలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ సర్కారు చేపట్టిన కార్యక్రమాలను చెబుతూనే కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించడం విశేషం. కాంగ్రెస్ పార్టీ పాలన కంటే ఇప్పుడు బాగుందా లేదా అంటూ.. బాగుందంటే కరతాళ ధ్వనులతో ఆమోదం తెలియజేయాలంటూ కోరారు. తన ప్రసంగంలో మరో సందర్భంలో… రాష్ట్రాన్ని 2029 నాటికి కరవు రహితంగా, అగ్రగామిగా నిలిపాలన్న లక్ష్యాన్ని చేరుకోవడం కోసం కష్టపడతారా.. చేతులు పైకెత్తి ఆమోదం తెలపాలంటూ చంద్రబాబు ప్రజలను కోరారు.
ఇక, కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ హాయంలో మంచినీళ్ల కోసం అక్కచెల్లెళ్లు అవస్థలు పడేవారు అన్నారు. రైతులు కూడా చాలా అవస్థలు పడేవారనీ.. ఎరువుల కోసం ఇబ్బందులు పడేవారనీ, లాఠీలతో కొట్టిన తరువాత కూడా ఒక్క బస్తా దక్కడం గగనమైపోతూ ఉండేదన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోని దుర్మార్గపు పాలన నాటిది అని చంద్రబాబు విమర్శించారు. రైతులు రాత్రిపూట పంపు సెట్ లకు వెళ్లి.. కరెంటు కోసం పడిగాపులు కాసేవారనీ, ఇప్పుడా పరిస్థితి సమూలంగా మారందని చెప్పారు. నాటి పాలనలో చిన్న తరహా పరిశ్రమలు మూతపడ్డాయనీ, ఎంతోమంది ఉపాధి కోల్పోయారన్నారు. రాష్ట్రం విడిపోయాక.. ఎన్నో సమస్యలతో పాలన ప్రారంభించామనీ, ఒక్కో సమస్యనూ సరిచేసుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు.
ఇదే సందర్భంలో కేంద్రం తీరుపై కూడా సున్నితంగా కొన్ని విమర్శలు చేశారు. కేంద్రం నుంచి మనకు రావాల్సినవి చాలా ఉన్నాయన్నారు. రైల్వే జోన్ రావాలనీ, ఆర్థిక లోటు తీర్చాలనీ, హోదాకు బదులుగా ఇస్తామన్న ప్యాకేజీ ద్వారా రావాల్సిన నిధులు, పోలవరం నిధులు కూడా చాలానే ఉన్నాయన్నారు. అన్నింటినీ అడుగుతున్నామనీ, ఒత్తిడి పెంచుతున్నామని చంద్రబాబు చెప్పారు. ఇక, కోడిపందాలూ, గిత్తల పందాల గురించి మాట్లాడుతూ.. వాటిని జూదంగా మార్చొద్దన్నారు. యువత గురించి మాట్లాడుతూ… ప్రతీ ఒక్కరికీ పదివేలు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పనితీరు, అభివృద్ధి ఆధారంగా గ్రామాలకు స్టార్ ర్యాంకింగ్ లు ఇస్తామన్నారు.
తెలుగుదేశం సర్కారు చేపట్టిన, చేపట్టబోతున్న కార్యక్రమాలను మరోసారి పెద్ద ఎత్తున ప్రజల్లోకి ప్రచారంగా తీసుకెళ్లే వేదికగా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు అని చెప్పొచ్చు. కాంగ్రెస్ పాలనపై విమర్శలు చేయడం కూడా ఇక్కడ గమనార్హం. నాటి పాలనతో పోల్చి టీడీపీ హయాం గురించి చంద్రబాబు గతంలో ఇలా మాట్లాడిన సందర్భాలు తక్కువే.