పురాణాల్లో చాలా కథలుంటాయి. ఎంతోమంది రాక్షసులు వస్తుంటారు. ప్రజలపై పడుతుంటారు. యజ్ఞాలు యాగాలను నిర్వహిస్తున్నవారిని అడ్డగిస్తారు. వాటిని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి తరుణంలో రాక్షసుల మదం అణచడానికి భగవంతుడు వివిధ రూపాల్లో వస్తుంటాడు. కొంతమంది రాక్షసులను చంపేందుకు సాక్షాత్తూ అమ్మవారే ఉగ్రరూపం దాల్చి దిగి వచ్చినట్టు కూడా పురాణాల్లో చెబుతారు. ఇంతకీ ఇప్పుడీ రాక్షసుల ప్రస్థావన ఎందుకంటే.. ఆంధ్రప్రదేశ్ లో రాక్షసులు ఉన్నారట! యజ్ఞయాగాది క్రతువులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారట! అయినా సరే, వారి ఆటలు సాగినివ్వబోనని ఒకరు అడ్డుపడుతున్నారట! ఇంతకీ ఆ యజ్ఞయాగాలు ఏంటంటే.. పోలవరం వంటి ప్రాజెక్టుల నిర్మాణం. రక్షణగా అడ్డుపడుతున్నది ఎవరంటే.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు! ఇక, అడ్డుపడే ఆ రాక్షస ప్రవృత్తి ఎవరిదంటే..ఇంకెవరిది ప్రతిపక్ష పార్టీది!
దసరా నవరాత్రుల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెళ్లారు. మూలా నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నప్పుడు ఓ సంకల్పం తీసుకున్నానని అన్నారు! పోలవరం ప్రాజెక్టుపై దుష్టశక్తుల దృష్టి పడకుండా కాపాడాలంటూ దుర్గమ్మను ప్రార్థించానని చెప్పారు. పెద్దపెద్ద హోమాలు, యజ్ఞాలు లాంటివి చేస్తున్నప్పుడు రాక్షసులు అడ్డుపడ్డట్టు పురాణాల్లో ఉందనీ, అలాంటి పరిస్థితి రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లోనూ రానీయ్యనని చంద్రబాబు స్పష్టం చేశారు! అమ్మవారిని దర్శించుకున్న సందర్భంగా ఇదే సంకల్పం చేసుకున్నానని సీఎం చెప్పడం విశేషం!
సీఎం దృష్టిలో ప్రాజెక్టులు అడ్డుకుంటున్నది ఎవరండీ..? దుష్టశక్తులు అంటే ఎవరండీ..? రాక్షసులు అంటే ఎవరండీ..? ప్రతిపక్షమే అని చెప్పకనే చెబుతున్నారు. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీని అభివృద్ధి నిరోధక శక్తిగా చిత్రించే ప్రయత్నం ఎలాగూ చేస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే అడ్డుకోవడమే జగన్ పని అంటూ విమర్శలు చేస్తున్నారు. సరే, దానికి ఉదాహరణగా ప్రతిపక్షం లేవనెత్తుతున్న కొన్ని అభ్యంతరాలను చూపిస్తారే అనుకుందాం. ఇప్పుడీ రాక్షసులూ దుష్టశక్తులూ అనడం కాస్త ఎక్కువైందని అనిపిస్తోంది. పైగా, దుష్టశక్తుల నుంచి తానే రక్షిస్తాను అన్నట్టుగా చెప్పుకోవడం కూడా సరైంది కాదనేదే కొంతమంది అభిప్రాయం. ప్రతిపక్షాన్ని మరీ ప్రత్యర్థి పక్షంగా చూడాల్సిన అవసరం ఏముంది..? ఇక, ఈ ప్రాజెక్టులూ నిర్మాణాలూ అంటారా.. ఎవరు అధికారంలో వారు పూర్తి చేయాల్సిందే. ఇదేమన్నా ఎవరికివారు సొంత సొమ్ము ఖర్చు చేస్తున్న కార్యక్రమాలు కావు కదా! అంతా ప్రజాధనమే కదా. ఇవాళ్ల టీడీపీ అధికారంలో ఉంది. పోలవరం కావొచ్చు, మరో ప్రాజెక్టు కావొచ్చు.. పనులు చేయాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. అంతమాత్రాన ఎవ్వరూ దైవాంశ సంభూతులు కారు కదా!