ఓపక్క వియ్యంకుడి నియోజకవర్గంలో పార్టీ నిలువునా చీలుతోంది..! అధిష్టానం అభీష్టంతో సంబంధం లేనట్టుగా హిందూపురంలో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అంత కీలకమైన విషయం గురించి చంద్రబాబు ఇంతవరకూ స్పందించలేదు! కానీ, ఒక ఉద్యోగ సంఘంలో ఎన్నికలు జరుగుతూ ఉంటే దానిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్టు తెలుస్తూ ఉండటం విశేషమే..! ఉద్యోగ సంఘాల ఎన్నికల్లో కూడా సీఎం స్థాయి నాయకుడు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందా అనేది ఈ సందర్భంగా పలువురి ప్రశ్న..?
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. ఈ నెల 9న ఉద్యోగుల సంఘం కమిటీని ఎన్నుకుంటున్నారు. రాజకీయ పార్టీతోగానీ, రాజకీయాలోగానీ ఏమాత్రం సంబంధంలేని ఎన్నిక ఇది. తమ సమస్యలపైనా, హక్కులపైనా ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉండేందుకు ఒక కమిటీని మాత్రమే ఇక్కడ ఎన్నుకుంటారు. అంతకుమించి ఈ ఎన్నికలో ఇతర రాజకీయాలకు ఆస్కారం ఉండదనే చెప్పాలి. అయితే, ఇలాంటి ఎన్నికల విషయంలో చంద్రబాబు కాస్త పట్టుదలకు పోతున్నట్టుగా కథనాలు వస్తున్నాయి.
ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న మురళీ కృష్ణను కొనసాగించాలన్నది చంద్రబాబు పట్టుదలగా తెలుస్తోంది. ఆయన్ని మరోసారి గెలిపించుకోవాలన్నది సీఎం ఆశ అంట. దీంతో ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న వెంకట్రామిరెడ్డిని వెనక్కి తగ్గాల్సిందిగా స్వయంగా ముఖ్యమంత్రే సూచించారని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. అయితే, ఎన్నికలు బాగా దగ్గరపడిపోవడంతో ఈ తరుణంలో నామినేషన్ ఉప సంహరణ సాధ్యమయ్యే పని కాదని ఆయన సీఎంకు చెప్పినట్టు సమాచారం! దీంతో తరువాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారినట్టు తెలుస్తోంది!
సచివాలయ ఉద్యోగ సంఘం ఎన్నికపై ముఖ్యమంత్రికి ప్రత్యేక శ్రద్ధ ఎందుకో ఈ సందర్భంగా చాలామందికి అర్థం కావడం లేదు! దాని ద్వారా ఆయన ఏం ఆశిస్తున్నారో! ఈ శ్రద్ధలో కాస్తైనా హిందూపురం మీద పెట్టి ఉంటే, అక్కడి పీయే సమస్య సెట్ అయ్యేది. అక్కడ అశ్రద్ధ, ఇక్కడి అతిశ్రద్ధ వెనకా చంద్రబాబు మార్కు వ్యూహం ఏదో ఉందనే పలువురు చెవులు కొరుక్కుంటున్నారు.