పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల నిర్వహణ తీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణ తీరుపై అనుమానాలున్నాయని ప్రకటించారు. ఈవీఎంలు టాంపరింగ్ జరిగినట్టు అనుమాన ఉందన్నారు. వీవీ పాట్లు ఎందుకు లెక్కించడం లేదని ప్రశ్నించారు. తమ ప్రశ్నలకు ఈసీ దగ్గర సరైన సమాధానం లేదని ఉత్తమ్ ప్రకటించారు. ఎవరి ప్రయోజనాల కోసం వీవీ ప్యాట్లు స్లిప్పులు లెక్కించడం లేదని ప్రశ్నించారు. బూత్‌లలో పడ్డ ఓట్లకు..ఈవీఎంలలో వస్తున్న ఫలితాలకు పొంతన లేదని పలు ఉదాహరణుల చెప్పుకొచ్చారు. ధర్మపురిలో తమ అభ్యర్థి 400 ఓట్లతో ఓడిపోయారని.. వీవీ పాట్ స్లిప్పులు లెక్కించమంటే లెక్కించలేదని ఆరోపించారు. కేసీఆర్‌తో కలిసి ఈసీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు.
మరో వైపు.. తెలంగాణలో ప్రజాతీర్పును గౌరవిస్తున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు తెలంగాణలో గెలుపొందిన శాసనసభ్యులందరికీ అభినందనలు తెలిపారు. టీజేఎస్ అధినేత కోదండరాం కూడా.. కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జతకట్టి కూటమికి మద్దతుగా చంద్రబాబు ప్రచారం చేశారు. కేసీఆర్ నియంత పాలనకు తెలంగాణ ప్రజలు చరమగీతం పాడాలంటూ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అయితే తెలంగాణ ఓటర్లు మాత్రం కేసీఆర్ కు మద్దతు పలికారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు శుభాకాంక్షలు చెబుతూ పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ట్వీట్లు, ఫోన్లు చేస్తున్నారు.
టీఆర్ఎస్ విజయాన్ని ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు కూడా ఆసక్తిగా గమనించాంయి. అధికారంలో ఉంది..అధికార వ్యతిరేకతను ఎలా..అధిగమించగలిగారన్న దానిపై.. ఆయా పార్టీల నేతలు విశ్లేషణలు జరుపుతున్నారు. మొత్తానికి పీసీసీ చీఫ్ ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేసినా… ఇతర పార్టీల నేతలెవరూ.. దీనిపై.. పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదు.