ప్రతిపక్ష పార్టీ నేత జగన్ మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ ఇద్దరూ ప్రతీరోజూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకరు పాదయాత్రలో, మరొకరు బస్సుయాత్రలో ప్రతీ రోజూ ముఖ్యమంత్రిపై దుమ్మెత్తి పోస్తున్నారు. వీటిపై సీఎం కూడా ఎదురుదాడికి దిగుతున్నారు. తన నలభైయేళ్ల రాజకీయానుభవాన్ని ప్రశ్నించిన పవన్ కు నిన్ననే ఘాటు సమాధానం ఇచ్చిన సంగతీ చూశాం. అయితే, తనపై వస్తున్న విమర్శల్ని తిప్పికొట్టేందుకు మరో కీలకమైన అంశాన్ని చంద్రబాబు తెర మీదికి తేవడం విశేషం. విజయనగరం జిల్లాలో జరిగిన నవ నిర్మాణ దీక్ష సభలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.
ఇసుక, చెరువుల్లో మట్టిని ఉచితంగా తీసుకోవచ్చని తాను ప్రజలకు చెబుతుంటే, దాన్లో అవినీతి చేశానంటూ తనపై విమర్శిస్తున్నారని అన్నారు సీఎం. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘నాకు ఎలాంటి బలహీనతలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నాను..? నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడైనా తాగాననో, సిగరెట్లు కాల్చాననో, అమ్మాయిలతో తిరిగాననో, ఎప్పుడైనా విన్నారా తమ్ముళ్లూ అని మిమ్మల్ని అడుగుతున్నా’ అన్నారు చంద్రబాబు. చెడు సావాసాలు ఎప్పుడూ చెయ్యలేదన్నారు. ఎందుకంటే, తాను వ్యక్తిగతంగా ఒక క్రమశిక్షణ పెట్టుకున్నాననీ, ఒక పద్ధతి ప్రకారం రాజకీయాలు చెయ్యాలనుకున్నాననీ, భావి తరాలకు ఆదర్శం కావాలన్న ఆలోచనే తప్ప, చిన్నచిన్న వ్యసనాలు బలహీనతలకు లోనైతే నాయకత్వం ఇవ్వలేనని నిశ్చయించుకున్నాను అని సీఎం చెప్పారు. అలాంటి వారు నా గురించి మాట్లాడుతున్నారని ప్రజలు గుర్తుపెట్టుకోవాలన్నారు. జైలుకు పోయిన ఒక గజదొంగ ఒక ఊరి పెద్ద మనిషిని తిడితే, ఆ పెద్ద మనిషి ఎంతగా బాధపడతాడో అర్థం చేసుకోవాలన్నారు. తనది కూడా లాంటి బాధే అని చంద్రబాబు చెప్పారు. ఈ బాధ అంతా ప్రజల కోసమే అన్నారు. తనను బంగాళాఖాతంలో పడేస్తాననీ, నడిరోడ్డు మీద ఉరేస్తానంటూ వారు వాడుతున్న భాష ఎలాంటిదో ప్రజలు చూస్తూనే ఉన్నారన్నారు.
తనపై విమర్శలు గుప్పిస్తున్నవారి నాయకత్వ లక్షణాలనీ, బలహీనతల గురించి చంద్రబాబు ఎత్తి చూపే ప్రయత్నం కాస్త ప్రత్యేకంగానే కనిపిస్తోంది. ఈ తరహా విమర్శలు ప్రజలను కొంత ఆలోచింపజేసే అవకాశం ఉందనే అనిపిస్తోంది. నేర చరిత్రలు, బలహీనతలు ఉన్న నాయకులు ఎవరైనా సరే, వారి గురించి ప్రజల్లో చర్చ జరగాల్సిందే కదా!