న్యాయమూర్తులుగా పని చేసి.. రిటైరైపోయి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నట్లుగా మాట్లాడుతున్న ఒక మాజీ తమిళనాడు హైకోర్టు.. ఒక మాజీ సుప్రీంకోర్టు జడ్జిలను చంద్రబాబు ” పేటీఎం మేధావులు”గా అభివర్ణించారు. ఓ మాజీ ఐపీఎస్ అధికారి టీడీపీలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసినకార్యక్రమంలో మాట్లాడిన చంద్రబాబు ఏ మాజీ జడ్జి పేరునూ చెప్పలేదు. కానీ వారెవరో తెలిసేటట్టుగా విమర్శలు చేశారు.
” ఒక జడ్జి ఎక్కడ్నుంచో ఇక్కడికి వచ్చి రాజ్యాంగ ఉల్లంఘన అంటున్నారు. రాష్ట్రంలో ఉన్న దారుణ పరిస్థితులు వీళ్లకు పట్టవా?” అని ప్రశ్నించారు. ఏపీలో మానవ హక్కులను ఉల్లంఘిస్తూ జరుగుతున్న దాడులు, దౌర్జన్యాల కారణంగా జరుగుతన్న ఆత్మహత్యలు, అల్లకల్లోలం ఆ జడ్జీలకు కనపడదా? అని చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒకాయన సుప్రీంకోర్టు జడ్జ్‌గా పని చేశారు. ఆయన కుమారుడికి ఏపీలో పదవి తీసుకుని జగన్‌ను పొగుడుతున్నారని తప్పు పట్టారు.
న్యాయమూర్తులుగా పని చేసి రిటైరై వీరంతా పేటీఎం మేధావుల్లా తయారయి జగన్‌కు సపోర్టు చేస్తున్నారని విమర్శించారు. రిటైర్ అయిన తర్వాత వీళ్ళకి పదవులు కావాలి.. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తన ప్రసంగంలో చంద్రబాబు ఎవరి పేర్లనూ ప్రస్తావించలేదు. కానీ ఇటీవల ఏపీ హైకోర్టుపై జస్టిస్ చంద్రు చేసిన వ్యాఖ్యలు.. అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేసి.. ప్రస్తుతానికి జగన్ ప్రభుత్వానికి అనధికార న్యాయసహాదారుగా ఉన్న జాస్తి చలమేశ్వర్పై ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కుమారుడు ఏపీ ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్నారు.