చంద్రబాబునాయుడు సుదీర్ఘ కాలం పాటు మీన మేషాలు లెక్కించిన తర్వాత.. ఇక ప్రజల్లో కూడా ఆగ్రహం వస్తున్నదనే వాస్తవాన్ని గుర్తించి ఎంతో కొంత స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అనుమతులు లేకుండా చేపడుతున్న నీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కేంద్రానికి లేఖ రాయడం గురించి కేబినెట్లో తీర్మానించారు. అవసరమైతే ఈ నిర్మాణాల మీద న్యాయపోరాటం చేయాలని కూడా అనుకున్నారు. అయితే ఆయన నిర్ణయం అప్పుడే విమర్శల పాలవుతోంది. నిజానికి ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెసు, వైకాపా పార్టీలు కూడా తెలంగాణ ప్రాజెక్టులను సమానంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ.. ఆ కోటాలో తిట్లు మాత్రం చంద్రబాబుకే ఎక్కువగా పడుతున్నాయి. తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు.. చంద్రబాబు మీద ఒక రేంజిలో ఫైర్ అయిపోవడం విశేషం.
తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో చాలా కాలంగా వేగంగా పావులు కదుపుతున్నప్పటికీ చంద్రబాబునాయుడు ఇప్పుడే ఎందుకు స్పందించారనే ప్రశ్నకు సమాధానం అందరికీ తెలిసిందే. వైఎస్ జగన్మోహనరెడ్డి నిరశన దీక్షకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలోనే.. ప్రభుత్వానికి పరువుపోకుండా చంద్రబాబునాయుడు స్పందించారు. ఇప్పుడు అదే కారణాన్ని హరీశ్ కూడా ఎత్తిచూపిస్తున్నారు. కేవలం వైఎస్ జగన్మోహనరెడ్డి మీద పైచేయి చాటుకోవడానికే.. చంద్రబాబునాయుడు ఇలాంటి కుట్రలు చేస్తున్నారంటూ హరీశ్ ఆరోపిస్తున్నారు. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు సంకల్పించిన ప్రాజెక్టులనే ఇప్పుడు తాము చేపడుతున్నాం తప్ప.. కొత్త ప్రాజెక్టులు ఏమీ కాదని ఆయన అంటున్నారు.
పట్టిసీమకు పరిహారంగా తెలంగాణకు 45 టీఎంసీల నీళ్లు రావాల్సి ఉంటుందని, హంద్రీనీవా, గాలేరు నగరి తదితర ప్రాజెక్టులను ఏ అనుమతులతో కట్టారో తేల్చిచెప్పాలని హరీశ్‌రావు అంటున్నారు.
హరీశ్ అంటున్న మాటల్లో ఒక అంశాన్ని కీలకంగా గమనించాల్సి ఉంది. చంద్రబాబు కేబినెట్ చేసిన తీర్మానం నాలుక గీసుకోవడానికి కూడా పనికి రాదని తెలంగాణ ప్రాజెక్టులను ఎవ్వరూ ఆపలేరని హరీశ్‌రావు సెలవిచ్చారు. ఈ విషయంలో చంద్రబాబు సర్కారు నుంచి బాధ్యులైన వారు స్పందిస్తే తప్ప ప్రజలకు క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ప్రాజెక్టుల విషయంలో ఏపీకి అన్యాయం జరగకుండా చివరికంటా బాబు సర్కార్ పోరాడుతుందా? లేదా, హరీశ్ చెప్పినట్లుగా ఆ కేబినెట్ తీర్మానం చెత్తబుట్ట దాఖలు అవుతుందా? అనేది ఎవరో ఒకరు తేల్చాలి.
చంద్రబాబు, జగన్‌ల కుట్రలు సాగనివ్వం అని మరో మంత్రి జోగు రామన్న కూడా అంటున్నారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడానికే ఈ ఇద్దరు నాయకులు కుట్రలు చేస్తున్నారంటూ ఆయన ఆరోపించడం విశేషం.