పరీక్షలు రద్దు చేయాలని నిన్నటిదాకా లోకేష్ ఆన్ లైన్ ఉద్యమం నడిపితే.. ఇప్పుడు లాక్ డౌన్ పెట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు వాయిస్ పెంచారు. గత రెండు ప్రెస్మీట్లలోనూ చంద్రబాబు ప్రధాన డిమాండ్ లాక్ డౌన్ పెట్టాలనే. ఏపీ సర్కార్ ప్రజల్ని కరోనాకు వదిలేసి… టీడీపీ నేతల కక్ష సాధింపులు.. ప్రజా ఆస్తులను ఇతరులకు ధారదత్తం చేయడం వంటి వాటి మీద దృష్టి పెట్టిందని ఆరోపిస్తూ.. చంద్రబాబు అత్యవసర పొలిట్ బ్యూరో భేటీ నిర్వహించారు. కొన్ని తీర్మానాలు చేసి.. ప్రెస్మీట్ పెట్టి మీడియా ద్వారా ప్రభుత్వానికి వినిపించారు. సీసీఎంబీ చెప్పిన కొత్త కరోనా వైరస్ మ్యూటెంట్ ప్రమాదకరంగా మారిందని.. తక్షణం లాక్ డౌన్ పెట్టకపోతే..ప్రజలు తీవ్రంగా నష్టపోతారని.. చంద్రబాబు అంటున్నారు.
అదే సమయంలో వ్యాక్సిన్లను కొనుగోలు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. అడ్డగోలు ప్రచారానికి వందల కోట్లు కేటాయించిన ప్రభుత్వం వ్యాక్సిన్ కొనుగోలు కోసం కేవలం రూ. 45 కోట్లు మాత్రమే కేటాయించిందని మండిపడ్డారు. తక్షణం లాక్ డౌన్ పెట్టి… నిరుపేదలకు సాయం చేయాలని ఆయన కోరుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం పెట్టిన కర్ఫ్యూ వల్ల ఉపయోగం లేదని తేల్చేశారు. కర్ఫ్యూ పెట్టి నిత్యవసరాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా.. ఉ.6 గంటలకే మద్యం దుకాణాలకు ఎలా అనుమతిస్తారని విమర్శలు గుప్పించారు.
నిజానికి లాక్ డౌన్ పెట్టాలన్న సూచనలు.. సలహాలు.. డిమాండ్లు… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అన్ని వైపుల నుంచి వస్తున్నాయి. కానీ లాక్ డౌన్ పెడితే… గతంలోలా ఆర్థిక వ్యవస్థ చితికిపోతుందని.. అదే జరిగితే .. కోలుకోవడం అసాధ్యమని.. ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అందుకే వ్యవస్థ కొనసాగేలా.. ఆంక్షలు పెడుతున్నారు. కానీ ఇలాంటి వాటి వల్ల కరోనా కట్టడి కాదని.. లాక్ డౌన్ పెట్టాల్సిందేనన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. పెట్టక తప్పదేమో అన్న పరిస్థితి కూడా వచ్చింది.