కేంద్ర ఎన్నికల సంఘం.. ఏకపక్షంగా వ్యవహరిస్తూ.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారని.. సీఎస్ సహా… పలువురు పోలీసు అధికారుల్ని బదిలీ చేయడంపై.. ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఓ ఘాటు లేఖ రాశారు. అదే లేఖను… అమరావతిలోని ఏపీ సీఈవోకి ఇచ్చారు. ఆ తర్వాత సీఈవో ఆఫీసు ముందు ధర్నాకు కూర్చున్నారు. వైసీపీ చెప్పినట్లు ఎన్నికల సంఘం చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్లు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తామంటే .. చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కేంద్ర ఎన్నికల సంఘమే.. అన్నీ నిర్ణయాలు తీసుకుంటే.. ఏపీలో సీఈవో అవసరం ఏమిటని ప్రశ్నించారు.
ఈవీఎంలపై నమ్మకం లేదని ఫిర్యాదు చేశామని … వీవీప్యాట్ స్లిప్‌లను లెక్కించాలని కోరామని.. అయినా ఈసీ స్పందించలేదన్నారు. బ్యాలెట్ పద్ధతిలో ఓట్లను కౌంట్ చేయడానికి 6 రోజులు పడుతుందని…సుప్రీంకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారమని మండిపడ్డారు. ఓట్లను తొలగించాలంటూ వచ్చిన తప్పుడు దరఖాస్తుల నిందితుల్ని పట్టుకునేందుకు ఐపీ అడ్రస్‌లు ఇవ్వలేదన్నారు. తెలంగాణలో 25 లక్షలు ఓట్లు తీసేస్తే సారీ చెప్పి వదిలేశారని .. దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈసీకి ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.ఈసీ పరిధిలో లేకున్నా అధికారులను బదిలీ చేశారని విమర్శించారు. ఎలాంటి కంప్లయింట్ లేకపోయినా కడప ఎస్పీని, సీఎస్‌ను ఏకపక్షంగా బదిలీ చేశారన్నారు. టీడీపీ నేతలపైనే ఎందుకు ఐటీ దాడులు చేస్తున్నారని… వైసీపీలో అవినీతిపరులు లేరా? అని ప్రశ్నించారు. తెలంగాణలో రూ.8 కోట్లు పట్టుబడినా చర్యలు లేవని గుర్తు చేసారు. ఆళ్లగడ్డలో డబ్బులు వెదజల్లుతున్నా పట్టించుకోలేదు.. ఎన్నికల కమిషన్ వైసీపీ నేతల జేబు సంస్థగా మారిందని చంద్రబాబు మండిపడ్డారు. ఎస్పీ బదిలీ అవుతాడని ఉదయం అభ్యర్థి చెప్పారని.. .. సాయంత్రానికి ఎస్పీని బదిలీ చేశారని.. ఇదేం పద్దతని చంద్రబాబు మండిపడ్డారు.
సీఈసీ వచ్చి వైసీపీకి ప్రచారం చేస్తే మాకు అభ్యంతరం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఐటీ దాడులు ఎలా చేస్తారని ప్ఱశ్నించారు. జగన్ హైదరాబాద్‌లో కూర్చొని ఏపీపై మానిటరింగ్ చేస్తున్నాడని.. కేసీఆర్, కేటీఆర్ డైరక్షన్ లో ఏపీలో ఓటింగ్ ను ప్రభావితం చేయాలనుకుంటున్నారని విమర్శించారు. అన్ని నిర్ణయాలు ఢిల్లీలో తీసుకుంటే సీఈవోలు ఎందుకన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం ప్రతిఒక్కరి బాధ్యతన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని 65 మంది అధికారులు రాష్ట్రపతిని కోరారని గుర్తు చేశారు. ఓ ముఖ్యమంత్రి .. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ.. సీఈవో కార్యాలయం ముందు ధర్నాకు దిగడం ఇదే తొలి సారి. ఎక్కడైనా.. అధికార పార్టీకి అనుకూలంగా అధికారులు ఉన్నారనే ఆరోపణలు వస్తాయి. కానీ ఏపీ మాత్రం దానికి భిన్నంగా.. వైసీపీకే.. ఢిల్లీ స్థాయి నుంచి సహకారం అందుతోంది. వారు చెప్పిన అధికారులను బదిలీ చేస్తున్నారు. నిరసనతో ఈసీలో మార్పు వస్తుందని ఆశిస్తున్నామని చంద్రబాబు ధర్నా అనంతరం వ్యాఖ్యానించారు.