భూస్థాపితం చేశామనుకున్న ప్రత్యేక హౌదా సమస్య మళ్లీ ప్రాణం పోసుకుని వచ్చి ముప్పుతిప్పలు పెడుతుందని వూహించిన టిడిపి ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు ఒక విధమైన అయోమయంలో కూరుకుపోవడం స్పష్టంగా కనిపిస్తుంది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నదీ చేస్తున్నదీ సరైన దిశలో వుందా అని వారు సందేహిస్తున్నారు. బిజెపితో తెగతెంపులు జరిగే పని కాదని వారికి పదే పదే సంకేతాలిచ్చి కూడా వీరోచితంగా మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తున్నది. పవన్ కళ్యాణ్ జనసేనకు అవసరాన్ని మించిన విలువ ఇచ్చి ఆయన చెప్పే ప్రకారం తాము స్పందిస్తామన్న భావన కలిగించడం టిడిపిలో చాలామందికి మింగుడు పడటం లేదు.అసలు పవన్ ఏంచేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో చంద్రబాబుకు తెలుసా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఆయన జెఎఫ్‌సిలో ఉండవల్లి,చంద్రశేఖర్, ఐవైఆర్ కృష్ణారావులు టిడిపివ్యతిరేకులేనని గుర్తు చేస్తున్నారు. అవిశ్వాసం రాజీనామాలు ఎజెండాలో లేనప్పుడు ఎందుకు స్పందించాలి? అఖిలపక్షం పెట్టి ఏం చెబుతారు? అని కూడా నాయకులు అంతర్గతంగా ఆగ్రహించారట. ఏదో విధంగా కాలం గడిపి మళ్లీ ఎన్నికల పొత్తుకు వెళ్లడం తప్పనప్పుడు ఎందుకు ఇంత రభస? ఎంతకాలమీ అభినయం అని వారు ఆక్షేపిస్తున్నారు.ఒకరిద్దరు మంత్రులు ఎంపిలు కూడా అధినేతపైన అధిష్టానంపైన నిరసన ప్రకటించారట.
ఇక వైసీపీది మరో విధమైన సమస్య. పవన్ జెఎఫ్‌సిపై దాడి చేయాలనుకుని మళ్లీ ఒకడుగు వెనక్కు వేశారు. సాక్షి ఛానల్లో పవన్‌నూ చంద్రబాబునూ కలిపి కథనాలు వండివార్చిన తర్వాత జగన్ ఆయన తెచ్చిన అవిశ్వాసం ప్రతిపాదనపై వేగంగా స్పందించారు. ఆ విధంగా తను కూడా పవన్ ఎజెండానే అనుసరించారన్నమాట. అదే సమయంలో బలం లేదు గనక తాము అవిశ్వాసం నోటీసు ఇచ్చినా చాలదని టిడిపిని ఒప్పించాలని చెబుతూ పవన్‌కు సమాధానమిచ్చే అవకాశం కలిగించారు. తీరా పవన్‌నుంచి సమాధానం వచ్చాక కాదనలేక ఒప్పుకోలేక దాడికి కొత్త రూపమిచ్చారు. ఆయన మార్చి4నే అవిశ్వాసం పెట్టాలనడం తప్పయినట్టు, జగన్ సవాలును స్వీకరిస్తామనే మాట అపరాధమైనట్టు మాట్లాడారు.సవాలు అనే పదం వాడకపోయినా జగన్ స్పందన, మీ పార్టనర్ టిడిపిని ఒప్పించండి అని బహిరంగంగా చెప్పడం సవాలులాగే అనిపించాయి. ఈ దశలో మీ ఇద్దరూ బిజెపికి లోబడిపోయినట్టున్నారని పవన్ వ్యాఖ్యానించేందుకు దీనివల్ల అవకాశం కలిగింది. తాను టిడిపి పార్టనర్‌ను కాదని సమాధానమిచ్చుకునే వీలు కూడా కలిగింది. సభలో తనకు ఒక్కరైనా లేకున్నా ఇతరులను కలిసి మద్దతు కూడగడతానని ఆఫర్ కూడా చేశారు. ఇవన్నీ వ్యూహాత్మకం కావచ్చు గాని అలా చేసే హక్కు ఆయనకు వుంటుంది కదా.. పైగా నేను టిడిపితో లేనని ఆయన పదేపదే చెబుతుంటే ఇద్దరూ ఒక్కటేనని పాత పాట పాడటం కూడా సమంజసం కాదు. ప్రజలు ఎంత తీవ్రంగా తీసుకుంటారనేది వారి ఇష్టం కాని వైసీపీ వూరికే మండిపడటం అర్థం లేని పని. ఈ దెబ్బతో ఆయన చొరవ తనచేతుల్లోకి తీసుకోవడం మాత్రం నిజం.