ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డైరెక్ట్ అటాక్ కి దిగారు. ప్రతిపక్ష పార్టీ వైకాపాతోపాటు, భాజపా, జనసేనల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో జరిగిన నగరదర్శిని సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఒకప్పుడు బ్రిటిష్ వారు దేశానికి అన్యాయం చేస్తుంటే, ఆరోజున కూడా కొంతమంది కుట్రదారులు వారికి వంతపాడారన్నారు. ఈరోజున కూడా అలాంటి కుట్రదారులే ఆంధ్రాలో ఉన్నారనీ, అలాంటివారిని ఎదుర్కొనడం కోసం తెలుగుజాతి ఒకటిగా ఉండాలన్నారు. ‘కుట్రదారులకు చిత్తుచిత్తుగా బుద్ధిచెప్తాం. అవసరమైతే బంగాళాఖాతంలో కలుపుదామని చెప్పాల్సిన అవసరం ఉంది’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
ఒక నాయకుడిగా ఎప్పుడు స్పందించాలో అప్పుడే స్పందిస్తానని గతంలో చెప్పానని చంద్రబాబు గుర్తుచేశారు. వైకాపా నేతలు మూడేళ్ల కిందటే రాజీనామాలు చేస్తామన్నారనీ, ఆ తరువాత రాష్ట్రపతి ఎన్నికల్లో కేంద్రానికి మద్దతు ఇచ్చారన్నారు. ఈ మధ్య కాలంలో ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని అడగలేదన్నారు. ఇలాంటివారు తమను ఫాలో కావాలంటూ టీడీపీని కోరారన్నారు. ‘నీకు(జగన్) రాజకీయాల్లో ఓనమాలు తెలీదు. ఇంతవరకూ ఎక్కడా లేనుకూడా లేవు. నిన్ను నమ్మితే కుక్కతోపట్టి గోదావరి ఈదినట్టవుతుంది. ఆ పరిస్థితి రాష్ట్రానికి రానివ్వనని చెప్పాను’ అన్నారు సీఎం. అవిశ్వాసానికి వారిని ఫాలో కావాలన్నారనీ, కానీ ఇప్పుడెక్కడున్నారని ప్రశ్నించారు. కేంద్రంతో లాలూచిపడి రాజీనామాలు చేసి… ఇళ్లలో పడుకున్నారన్నారని ఎద్దేవా చేశారు.
టీడీపీ యుద్ధానికి వెళ్తే వెనక్కి తగ్గే పరిస్థితి ఉండదనీ, అదే చేస్తున్నామన్నారు. ఇప్పుడు రాజీనామాలు చేయాలంటూ తమపై వైకాపా ఒత్తిడి తెస్తోందనీ, ఎవరికి భయపడి రాజీనామాలు చేయాలని ప్రశ్నించారు. ప్రతీరోజూ ఢిల్లీలో ఉంటామనీ, దేశంలో అందరినీ కలుపుకుంటామనీ, తెలుగు జాతి సత్తా ఏంటో చాటుతామే తప్ప… వెనుదిరిగే పరిస్థితి లేదన్నారు.
వైకాపాపై చంద్రబాబు డైరెక్ట్ టార్గెట్ కి దిగడం ప్రారంభించినట్టున్నారు. ప్రత్యేక హోదా సాధన పోరాటంలో జగన్ వైఫల్యాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఎంపీల రాజీనామాలతో వైకాపా సెల్ఫ్ గోల్ చేసుకుందని ఇప్పటికే ఆ పార్టీలో కూడా చర్చ మొదలైన పరిస్థితి. దీంతో ఇప్పుడీ అంశాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా మలుచుకునేందుకు టీడీపీ రెడీ అవుతోందన్నది సీఎం మాటల్లో చాలా స్పష్టంగా ధ్వనిస్తోంది. అంతేకాదు, గతంలో టీడీపీని ఉద్దేశించి జగన్ చేసిన విమర్శల్లో ఒకటైన ‘బంగాళాఖాతంలో కలిపేయడం’ టాపిక్ గుర్తుచేస్తూ తిప్పికొట్టడం విశేషం.