విక్రమార్కుడి లక్షణాల గురించి తెలుసా మీకు? చరిత్ర అంటేనే చెత్త అనే అభిప్రాయమున్న చంద్రబాబునాయుడు ఆ విక్రమార్కుడి గురించి చదివాడో…లేదో తెలియదు కానీ ఆయనలో ఉన్న కొన్ని లక్షణాలు మాత్రం చంద్రబాబులో బలంగా ఉన్నాయి. తాను నమ్మిన, నమ్మించాలి అనుకున్న విషయాన్ని అందరూ నమ్మేవరకూ ఎన్నిరకాల ప్రయత్నాలైనా చేస్తూనే ఉంటాడు చంద్రబాబు. ఆ విషయంలో మాత్రం చంద్రబాబు పట్టుదలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. 2014లో ప్రమాణం స్వీకారం చేసినప్పటి నుంచీ కూడా బాబు చేస్తున్న అలాంటి అరవీర భయంకర ప్రయత్నాలను చూసి ఒక లక్ష్యం వైపుగా దూసుకెళ్ళాలనుకుంటున్నవాళ్ళు ఎవ్వరైనా…ఎంతైనా నేర్చుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఓటర్లను అందరినీ నమ్మించాలనుకుంటున్న…., అందరి చేతా చంద్రబాబు…ది గ్రేట్ అని అనిపించుకోవాలనుకుంటున్న, 2019లో కూడా అధికారంలోకి రావాలనుకుంటున్న లక్ష్యం దిశగా బాబు చేస్తున్న నమ్మించే ప్రయత్నాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే…..
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకోకముందు వరకూ తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి అని చంద్రబాబు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తెలంగాణా విషయంలో నిర్ణయం తీసుకోండి అని చెప్పి దేశంలో ఉన్న నాయకులను అందరినీ కలిశాడు. ‘టిడిపి భుజాలపై నుంచి కాల్చే ప్రయత్నం చెయ్యొద్దు, మేం చాలా స్పష్టంగా ఉన్నాం, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం తీసుకోండి, తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని మేం డిమాండ్ చేస్తున్నాం…’ అని చెప్పి చంద్రబాబు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇదే ఛాన్స్ అనుకుని తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు దిశగా ముందడుగు వేసింది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన పార్టీగా తెలంగాణాలో అధికారంలోకి రావొచ్చు. తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని చంద్రబాబు కూడా డిమాండ్ చేశాడు కాబట్టి సీమాంధ్ర ప్రాంతంలో టిడిపి కూడా నష్టపోతుంది కాబట్టి అక్కడా సేఫ్ అవ్వొచ్చు అనుకున్నారు. కానీ తెలంగాణా విషయంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోబోతోంది అని తెలిసిన వెంటనే ప్లేట్ మార్చేశాడు చంద్రబాబు. అలాగని సమైక్యాంధ్ర ప్రదేశ్ అని చంద్రబాబు ఎప్పటికీ అనలేడు. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టిడిపి అధికారంలోకి రావాలి. తెలంగాణాలో లోకేష్ ముఖ్యమంత్రి అవ్వాలి అని ఆలోచించాడు చంద్రబాబు. అందుకే హైదరాబాద్‌లో పెట్టి పెరిగాను. సిసలైన తెలంగాణా బిడ్డను అని చెప్పి లోకేష్ చేత సెంటిమెంట్ డైలాగ్స్ చెప్పించాడు. బలమైన భజన మీడియా, పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్, చంద్రబాబు హామీలకు తోడు నరేంద్రమోడీ, వెంకయ్యనాయుడి హామీలు కూడా కలిసొచ్చి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు. తెలంగాణాలో మాత్రం కెసీఆర్ ముందు చంద్రబాబు పప్పులు ఉడకలేదు. తెలంగాణా ప్రజలు చంద్రబాబు డ్రామాను అర్థం చేసుకున్నారు. ఎన్నికల ప్రచార సమయంలోనూ…. ఆ తర్వాత నుంచీ కూడా రాష్ట్ర విభజనలో తన పాపం లేదు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలను నమ్మించడం కోసం చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. అసెంబ్లీ, ప్రెస్ మీట్స్, బహిరంగసభలు అనే తేడా లేకుండా మైకు దొరికిన ప్రతిసారీ విభజన పాపాలు, కష్టాల గురించి మాట్లాడతాడు. విభజన సమయంలో తాను ఎంతగా బాధపడ్డాడు అనే విషయం కూడా చెప్తూ ఉంటాడు. విభజనకు వ్యతిరేకమా…? అనుకూలమా అని ప్రశ్నిస్తే మాత్రం బాబు దగ్గర సమాధానం ఉండదు. విభజన తీరు కరెక్ట్‌గా జరగలేదంటాడు. అదెలాగో చెప్పమంటే కూడా బాబు దగ్గర సమాధానం ఉండదు. తెలంగాణాకు జై కొట్టాడు, ఈ రోజుకీ కూడా తెలంగాణా ప్రయోజనాల గురించి కెసీఆర్ మాట్లాడినట్టుగా సీమాంధ్ర ప్రయోజనాల కోసం ఒక్క మాట కూడా మాట్లాడలేడు చంద్రబాబు. ఎందుకంటే తెలంగాణాలో కూడా టిడిపి అధికారంలోకి రావాలి అన్నది చంద్రబాబు ఆలోచన. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల విషయంలో చంద్రబాబు ఆలోచనలు ఇంత అన్యాయంగా ఉంటాయి. అయితేనేం ఆ ప్రజలను నమ్మించడం కోసం బాబు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కాదు. విభజన పాపంలో నా తప్పు లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసం పోరాటం చేసిన వీరుడిని అని చెప్పి ఎక్కువ శాతం ప్రజలను నమ్మించడంలో సక్సెస్ అయ్యాడు చంద్రబాబు. ఓటర్లను నమ్మించడం కోసం ఈ రోజుకీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. విభజన పర్వంలో చంద్రబాబు తప్పులేదు అని చివరి ఓటర్ని కూడా నమ్మించడమే చంద్రబాబు లక్ష్యం.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కి ఎన్నికలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ఆదాయం-అప్పుల లెక్కలు అప్పటికే అందరికీ తెలిసిపోయాయి. అయినప్పటికీ చంద్రబాబు మాత్రం అలవికాని హామీలు ఇచ్చాడు. రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేయడం అసాధ్యం అని చెప్పి రాజకీయపండితులు, ఇతర పార్టీల నాయకులు ఎన్నో విధాలుగా చెప్పారు. కానీ చంద్రబాబు అండ్ కో మాత్రం జగన్ తిన్న లక్ష కోట్లు లాక్కుని రుణమాఫీ చేసేస్తామని కామెడీగా సమాధానం చెప్పారు. తాను ఇచ్చిన అలవిగాని హామీలతో పాటు ప్రత్యేక హోదా, రాజధాని నిధులు, పోలవరం, రైల్వే జోన్‌లాంటి హామీల విషయంలో కూడా ప్రజలను నమ్మించడం కోసం చంద్రబాబు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కాదు. బాబు-మోడీ…. అభివృద్ధి జోడీ అన్నారు. పల్లాయి పలకడం కోసం పవన్ కళ్యాణ్‌ని తెచ్చుకున్నారు. ప్రజలను నమ్మించారు. అధికారంలోకి వచ్చారు. మొదటి సంతకమే రుణమాఫీ ఫైలుపై పెడతానన్నాడు. ఆ మొదటి సంతకం నుంచే బాబు మోసం ప్రారంభమయ్యింది. హామీలెందుకు అమలు చెయ్యడం లేదు అన్న ప్రజల విమర్శలకు చంద్రబాబు దగ్గర సమాధానం లేదు. తన మోసం బయటపడకుండా ఉండడం కోసం విభజనతో వచ్చిన కష్టాల వళ్ళే హామీలు అమలు చేయడం కుదరడంలేదు అని ప్రజలను నమ్మించడం కోసం ఎన్నో పాట్లు పడ్డాడు చంద్రబాబు. ఏవేవో లెక్కలు చెప్పాడు. ఆ లెక్కలు, కష్టాలు అన్నీ తెలిసిన తర్వాతే…విభజన పర్వం పూర్తయ్యాకే కదా…నువ్వు ఎన్నికల హామీలు ఇచ్చింది అంటే మాత్రం సమాధానం ఉండదు. అయినప్పటికీ అన్ని హామీలను అమలు చేయాలన్న తాపత్రయం చంద్రబాబుకు ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ చేసిన విభజన కష్టాల దెబ్బకు చంద్రబాబు ఏమీ చేయలేకపోతున్నాడు అని ప్రజలను నమ్మించాలి అన్నది చంద్రబాబు తాపత్రయం.
ప్రత్యేక హోదా, రాజధాని నిధులు, రైల్వే జోన్, పోలవరం…….అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్‌కి అత్యావసరాలే. వెనుకబడిన రాష్ట్ర ప్రజలుగా భవిష్యత్తరాలు కూడా నష్టపోకుండా ఉండాలంటే ఈ హామీలన్నీ సాధించుకోవడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యవసరం. రాష్ట్రానికి పెద్దకొడుకుగా ఉంటా అని ఎన్నికల సమయంలో చెప్పిన చంద్రబాబే ఇప్పుడు ఈ హామీలు అన్నింటి విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దగా చేస్తున్నాడు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజ్ గొప్పది అని ప్రజలను నమ్మించడం కోసం చంద్రబాబు, బాబు భజన మీడియా పడ్డ కష్టాలను చూస్తే పగవాడికి కూడా పాపం అనిపించాల్సిందే. రైల్వే జోన్‌ని పట్టించుకోవడమే మానేశాడు. ఇక పోలవరం విషయంలో బాబు ఆడుతున్న డ్రామాలు అన్నీ ఇన్నీ కాదు. 2018కి పూర్తి చేస్తానన్నాడు. ఇప్పుడు 2019 అంటున్నాడు. అంటే 2019ఎన్నికల తర్వాత అన్న మాట. కేంద్రమే చేపట్టి పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్‌ని తన చేతుల్లోకి తీసుకున్నాడు చంద్రబాబు. పోలవరాన్ని త్వరగా పూర్తి చేయడం కోసమో…రాష్ట్ర రైతుల ప్రయోజనం కోసమో చంద్రబాబు అలా చేశాడు అని నమ్మితే అంతకంటే మూర్ఖత్వం..అమాయకత్వం ఇంకొకటి ఉండదు. ప్రాజెక్ట్‌ల కంటే కూడా కమిషన్ల కోసమే కక్కుర్తి పడే నాయకులు మనవాళ్ళు అని రాష్ట్రంలో ఉన్న ఏ కాంట్రాక్టర్‌ని అడిగినా చెప్తాడు. రాజధాని నిధుల గురించి కూడా చంద్రబాబుకు పట్టింపే లేదు. కేటాయిస్తున్న నిధులకు….చంద్రబాబు చూపిస్తున్న బొమ్మలకు అస్సలు ఏమైనా సంబంధం ఉందా? 2014కి ముందు ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా జన్మానికో శివరాత్రి అన్నట్టు అధిష్టానానికి, కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడైనా ఒకసారి మాట్లాడేవారు. కానీ చంద్రబాబు మాత్రం మోడీకి వీరభక్తుడిగా…ఇంకా మాట్లాడితే బానిసగా ఉండడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. 2019 ఎన్నికలు వచ్చే వరకూ మోడీకి వ్యతిరేకంగా చంద్రబాబు నోటినుంచి ఒక్కమాట కూడా రాదు. అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న వీరుడిగా సీమాంధ్రలను నమ్మించడం కోసం వీరప్రయత్నాలు చేస్తున్నాడు చంద్రబాబు.
ఇక పట్టిసీమని మించిన ప్రాజెక్ట్ ప్రపంచంలోనే లేదు అని ప్రజలను నమ్మించడం కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే పట్టిసీమ ప్రాజెక్ట్‌కి అస్థిత్వమే లేదన్న నిజాన్ని మాత్రం కాదనలేడు. అసలు చంద్రబాబు రాజకీయ పయనం అంతా కూడా ఇలా నమ్మించడంతోనే స్టార్ట్ అయింది. నమ్మిన ఎన్టీఆర్‌కి చంద్రబాబు వెన్నుపోటు పొడవలేదు అని చెప్పి తెలుగు ప్రజలను నమ్మించడం కోసం చంద్రబాబు-బాబు భజన మీడియా చేసిన ప్రయత్నాలు పెద్ద గ్రంథమే అవుతాయి. ఇక నిప్పులాంటి వాడిని, ఎప్పుడూ తప్పు చేయలేదు, చేయబోను, ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదు లాంటి మోస్ట్ ఫన్నీయెస్ట్ ప్రయత్నాలు కూడా ఎన్నోచేస్తూ ఉంటాడు చంద్రబాబు. ఇప్పుడు సడన్‌గా ఎందుకు అవసరమొచ్చిందో తెలియదుకానీ గత కొన్ని రోజులుగా మరోసారి తన ‘మాయాబజార్’ సినిమాని ఇంకాస్త ఎక్కువ రంగుల్లో, ఎక్కువ హంగుల్లో ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు. బడ్జెట్ లెక్కలు, అభివృద్ధి పథంలో రాష్ట్రం దూసుకుపోతుంది, ప్రపంచంలోనే ఎక్కడా లేనంత స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రేటు ఉంది అని చెప్పడం బాబుకే చెల్లు. ఇక రాజధాని బొమ్మలు, పోలవరం కహానీలు అయితే జబర్ధస్త్ కామెడీని మించిపోయేలా ఉన్నాయి. ఇప్పటి వరకూ పోలవరానికే కనీస స్థాయి నిధులు కేటాయించింది లేదు కానీ ఇప్పుడు 90వేల కోట్లతో ఏదో కొత్త ప్రాజెక్ట్ అంటూ ముందుకొచ్చాడు బాబు. ఆ ప్రాజెక్ట్ నిర్మించేది 2019 ఎన్నికల తర్వాత అని ఎలాగూ చెప్తాడనుకోండి. 2014లో జిల్లాకో ఎయిర్పోర్ట్, ఇంటికో ఉద్యోగం లాంటి హామీలన్నీ చెప్పేశాడు కాబట్టి…2019లో అంతకుమించిన హామీలు ఇచ్చేదిశగా బాబు పయనం స్టార్ట్ అయినట్టే కనిపిస్తోంది. ఈ మూడేళ్ళూ చేసినట్టుగానే….ఇంకో రెండేళ్ళు కూడా మాటల గారడీ చేసి….ఆ తర్వాత 2019లో కూడా సీమాంధ్ర ఓటర్లను నమ్మించడాంటే మాత్రం చంద్రబాబు జీవితం ప్రపంచంవ్యాప్తంగా ఉన్న పదవుల కోసం పాకులాడే పొలిటీషియన్స్ అందరికీ పాఠం అవుతుందనడంలో సందేహం లేదు.