డ్వాక్రా మహిళలు, రైతులకు చెల్లని చెక్కులు ఇస్తున్నారంటూ… ప్రచారం చేసిన వైసీపీ నేతలకు… చేతలతోనే .. ఏపీ సర్కార్ కౌంటర్ ఇచ్చింది. మూడో విడత పసుపు-కుంకుమ నిధుల కింద రూ. 3 వేల 980 కోట్లను బ్యాంకులకు శనివారం విడుదల చేసింది. రైతులకిచ్చిన హామీని కూడా ప్రభుత్వం నిలుపుకుంది. నాల్గో విడత రుణమాఫీ నిధులు బ్యాంకుల్లో జమ అవుతుండడంతో సోమవారం నుంచి అర్హులైన రైతులందరూ తమ పేర్లను సంబంధిత బ్యాంక్ బ్రాంచిల్లో నమోదు చేసుకోవాలని ప్రభుత్వం కోరనుంది. ఏపీలో డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న 98 లక్షల మంది మహిళలకు పసుపు-కుంకుమ కింద మూడో విడత నిధులను సోమవారం నుంచి అందజేయనున్నారు. ఒక్కో మహిళకు 10 వేల రూపాయల చొప్పున ప్రభుత్వం పసుపు-కుంకుమ కింద ఇవ్వాలని నిర్ణయించింది.
ఇందుకోసం ఈ ఏడాది ఫిబ్రవరి మూడు పోస్టెడెడ్ చెక్కులను ఇచ్చింది. తొలి చెక్ రూ. 2 వేల 500 రూపాయలు, రెండో చెక్ రూ. 3 వేల 500 రూపాయలు ఫిబ్రవరి, మార్చిలో బ్యాంకుల్లో వేసి డ్వాక్రా మహిళలు డబ్బులు డ్రా చేసుకున్నారు. ఏప్రిల్ 4వ తేదీతో మూడో చెక్ ను రూ. 4 వేల రూపాయలకు ఇచ్చారు. ఈ చెక్ ను ఈ నెల 4వ తేదీన డ్వాక్రా మహిళలు బ్యాంకుల్లో జమ చేశారు. ఎన్నికల ప్రవర్తన నియామవళి అమల్లో ఉండటంతో డ్వాక్రా మహిళలకు డబ్బులిచ్చేందుకు వీల్లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులైన నేతలు అమరావతి, ఢిల్లీ హైకోర్టుల్లో పిటీషన్లు వేసినా కోర్టు తిరస్కరించి, పసుపు-కుంకుమ నిధులను విడుదల చేయొచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండ్రోజుల నుంచి ప్రభుత్వం నిధులను విడుదల చేయటం ప్రారంభించింది. 5, 6, 7 తేదీల్లో బ్యాంకులకు సెలవు దినమైనప్పటికీ, 6వ తేదీన రిజర్వ్ బ్యాంక్ పనిచేయటంతో రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఇవ్వాల్సిన 3 వేల 980 కోట్ల రూపాయలను శనివారం రిజర్వ్ బ్యాంక్ లో జమచేసింది. దీంతో డ్వాక్రా మహిళలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నుంచి డ్వాక్రా మహిళలు బ్యాంకుల్లో డబ్బులు డ్రా చేసుకోనున్నారు.
రైతులకిచ్చిన హామీ మేరకు రుణమాఫీ నాల్గో విడత నిధులు సుమారు రూ. 3 వేల 600 కోట్ల రూపాయలను బ్యాంకులకు ప్రభుత్వం విడుదల చేసింది. సోమవారం నుంచి అర్హత కల్గిన రైతులు బ్యాంకుల్లో తమ పేరు నమోదు చేయించుకుని.. తమ వద్ద ఉన్న బాండ్లను చూపిస్తే బ్యాంక్ అధికారులు తమకు వెంటనే సమాచారం పంపుతారని, మరుసటిరోజు సాయంత్రానికల్లా సంబంధిత రైతుల అకౌంట్లలో రుణమాఫీ నిధులు జమ అవుతాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ రుణమాఫీ వల్ల సుమారు 58 లక్షల 29 వేల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. రైతులకిచ్చిన హామీ మేరకు రుణమాపీ ఐదో విడత నిధులు కూడా వారం రోజుల్లో ప్రభుత్వం విడుదల చేయనుంది.