తెలుగుదేశం మళ్లీ అధికారంలోకి వస్తోందనీ, ఇదే పాలన కొనసాగుతుందని టీడీపీ నేతలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో అమరావతిలో జరిగిన సమావేశంలో ఎన్నికల సరళి, నియోజక వర్గాలవారీగా పరిస్థితులను సీఎం సమీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా నేతలతో మాట్లాడుతూ… వైకాపా నేతలు కొంత రెచ్చగొట్టే ధోరణిలోనే వ్యవహరిస్తున్నారనీ, కాకపోతే అలాంటి అంశాలపై సంయమనం పాటించాల్సి ఉందని చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. పరిస్థితులు శృతి మించితే పోలీసులకు ఫిర్యాదు చెయ్యాలని సూచించారు. ప్రజల సమస్యలు ఏవైనా ఉంటే, వెంటనే జిల్లా కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లాలని కూడా ఎమ్మెల్యేలకు చెప్పారు.
గత ఎన్నికలతో పోల్చుకుంటే అదనంగా పాతికపైనే సీట్లు టీడీపీకి ప్రజలు ఇచ్చి ఆశీర్వదించబోతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని తెలుస్తోంది. అనుకున్నదాని కంటే ఎక్కువ స్పందన వచ్చిందనీ, పోలింగ్ సరళిని గంట గంటకీ అధ్యయనం చేశాననీ, పార్టీకి ఎక్కడ అనుకూలంగా మారిందో, ప్రతికూలంగా ఉందో స్పష్టమైన వివరాలు ఉన్నాయని చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. 130 వరకూ అసెంబ్లీ స్థానాలు, 20 ఎంపీ స్థానాల్లో గెలవబోతున్నామని చెప్పినట్టు తెలుస్తోంది. ఈసీకి వైకాపా నేతలు చేస్తున్న ఫిర్యాదులపై స్పందిస్తూ… ప్రజలకు అందాల్సిన రోజువారీ పాలన అందాలనీ, ఈ విషయంలో వైకాపా వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని చంద్రబాబు అన్నారు. సాధారణ పరిపాలనపై కూడా ఫిర్యాదు చేయడం దారుణమనీ, ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి లేదని ఈ సందర్భంగా సీఎం వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఏపీలో ఎన్నికలు జరిగిపోయాయనీ, ఇప్పుడు ప్రజల అవసరాలను తీర్చాలనీ, దీని ద్వారా ప్రత్యేకంగా ఎవరినైనా ప్రభావితం చేసే పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా అని చంద్రబాబు అన్నారు.
ఈ సందర్భంగా ఎన్నికల ముందు, తరువాత నెలకొన్న పరిస్థితులను నియోజక వర్గాల వారీగా సమీక్షిస్తున్నట్టు సమాచారం. ఎన్నికలు ముందు, తరువాత క్షేత్రస్థాయిలో వివిధ మార్గాల ద్వారా తాను సేకరించిన సమాచారాన్ని పార్టీ నేతలతో పంచుకున్నట్టు తెలుస్తోంది. కొంతమంది అభ్యర్థులు ఎన్నికల సమయంలో సరిగా వ్యవహరించలేదనీ, వారి గెలుపు అవకాశాలు ఎందుకు తక్కువగా ఉన్నాయనేది కూడా చంద్రబాబు వివరించినట్టు తెలుస్తోంది. మొత్తానికి, గెలుపుపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని చెబుతూనే… దేశవ్యాప్తంగా మోడీకి తీవ్ర వ్యతిరేకత ఉందనీ, ఈసారి భాజపాకి 150 సీట్లు దాటవని కూడా చంద్రబాబు చెప్పినట్టు సమాచారం.