ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర మంత్ర దండం ఏదో ఉన్నట్టుగా ఉంది! నిన్నమొన్నటికీ ఆంధ్రాలో అన్నీ సమస్యలే అని చెప్పుకునేవారు. ఇప్పుడు అంతా బాగుందనే ఫీల్ గుడ్ ఫీలింగ్‌తో ఉన్నారని తెలుగుదేశం వర్గాలే చర్చించుకుంటున్నాయి. కొత్త సంవత్సరం ప్రారంభమైన దగ్గర నుంచీ చంద్రబాబు తీరులో మార్పు వచ్చిందని అంటున్నారు. మార్పు అంటే… అందర్నీ నవ్వుతూ పలకరించడం, చిరునవ్వుతో మాట్లాడటం ఇలా ఆయన ఎంతో హ్యాపీగా ఉన్నట్టుగా కనిపిస్తున్నారట! కారణం ఏంటంటే…. ఈ ఏడాది ప్రారంభం నుంచే చాలా బాగుందన్న భావనలో ఆయన ఉన్నారని అనుకుంటున్నారు. సమస్యలన్నీ తీరిపోయాయనీ, ఇకపై ఆంధ్రాకి మంచి రోజులు వచ్చేస్తున్నాయని తనను కలిసినవారితో చంద్రబాబు చెబుతున్నారట!
చంద్రబాబు హ్యాపీనెస్‌కు చాలా కారణాలున్నాయని చెబుతున్నారు. ఎన్నాళ్లుగానే నత్తనడకన సాగుతున్న పోలవరం ప్రాజెక్టులు పనులు ఊపందుకోవడం, ఓటుకు నోటు కేసు విచారణకు సంబంధించి కోర్టు నుంచి కొంత ఊరట లభించడం, పెద్ద నోట్ల రద్దు తరువాత తలెత్తిన సమస్యలు ఒక్కోటిగా తగ్గుముఖం పడుతూ ఉండటం, రాష్ట్ర ఆర్థిక లోటును భర్తీ చేసేందుకు కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వడం, తాత్కాలిక సచివాలయం నుంచి పాలన ప్రారంభించడం… ఇవన్నీ సానుకూలంగా మారాయనీ, అందుకే చంద్రబాబు చాలా హ్యాపీగా ఉన్నారని తమ్ముళ్లు చెబుతున్నారు.
నిజానికి, ఇదో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ గేమ్‌గా చెప్పుకోవచ్చు! తెలుగుదేశం సర్కారు వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఈ సానుకూల ప్రచారం కొత్త వ్యూహం కావొచ్చు. ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం ఘోర వైఫల్యం చెందింది. ప్యాకేజీతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అమరావతికి అట్టహాసంగా శంకుస్థాన చేశారు. ఇప్పటికీ అక్కడ శాశ్వత ప్రాతిపదిక నిర్మాణ పనులు జరగడం లేదు. రైతు రుణ మాఫీ, నిరుద్యోగ యువతకు భృతి, ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, రాజధాని ప్రాంతా రైతుల ఆవేదన… వీటన్నింటినీ మరిపించడం కోసమే ‘అంతా బాగుంది’ అనే సానుకూల దృక్పథాన్ని ప్రచారంలోకి తీసుకొస్తున్నట్టు చెప్పుకోవాలి.
రాష్ట్రంలో ప్రజలు తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా ఉన్నారంటూ నిఘా వర్గాలు చెబుతున్నాయని కూడా లీకులిస్తున్నారు. వెలగపూడికి వచ్చిన తరువాత అంతా కొలిసొచ్చిందనే సెంటిమెంట్‌ను కూడా ప్రచారం చేసుకుంటున్నారు. అంతా బాగుందని అనుకుంతన్న మాత్రాన ఉన్న సమస్యలు లేకుండా పోవు కదా! వాస్తవ దృక్పథంతో పాలించేవారికి సమస్యలూ కనిపించాలి, వాటికి పరిష్కారాలు కనిపించాలి. అంతేగానీ, సమస్యలు లేనట్టుగా కనిపించకూడదు.