కర్నూలులో జరిగిన ధర్మపోరాట దీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మరోసారి కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ ప్రయోజనాల విషయంలో యూటర్న్ తీసుకుంది తాను కాదనీ, ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వైకాపా ట్రాప్ లో తాను పడ్డానని విమర్శిస్తున్నారనీ, వాస్తవానికి ట్రాప్ లో పడింది మీరేననీ, దాని ఫలితం రాబోయే ఎన్నికల్లో మీరు అనుభవిస్తున్నారంటూ ప్రధానిని ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఒక అవినీతి పార్టీ మద్దతు ఉందని ఇష్టానుసారంగా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రయోజనాలు గాలికి వదిలేశారన్నారు. తనకు రాజకీయ పరిపక్వత లేదంటూ విమర్శిస్తున్నారనీ, ఈయన సర్టిఫికేట్ నాకు అవసరమా తమ్ముళ్లూ అన్నారు! రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్ పార్టీ చేతులు కాల్చుకుందనీ, ఈరోజున అంతకంటే ఘోరంగా భాజపా పరిస్థితి ఉంటుందన్నారు.
పీడీ అకౌంట్ల గురించి మాట్లాడుతూ… ఇందులో కూడా మోసం జరిగిందని ఒక వ్యక్తి చెప్తున్నారనీ, కానీ… ఈరోజున ప్రభుత్వం చేసే ఖర్చులు మొదలుకొని, ఇచ్చే పెన్షన్లతో సహా అన్నీ గంటలవారీగా ఆన్ లైన్ లో చూసుకునే విధంగా ఏర్పాటు చేసి పారదర్శకత తీసుకొచ్చామన్నారు. దీనిపై కూడా బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ పరోక్షంగా జీవీఎల్ నర్సింహారావుకు కౌంటర్ ఇచ్చారు. రాఫెల్ మొదలుకొన్ని అన్నింటా అవినీతిలో కూరుకుపోయింది భాజపా అనీ, అవినీతిని ప్రోత్సహిస్తున్నది మీరేనని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర ప్రజల హక్కుల గురించి తాము పోరాటం చేస్తుంటే… అవినీతి పార్టీల పంచన చేరి మమ్మల్ని విమర్శిస్తున్నారని పరోక్షంగా వైకాపాని ప్రస్థావించారు. కేంద్రం సహకరించకపోయినా ప్రజలందరికీ న్యాయం జరగాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నామన్నారు. ఆల్ ఇండియా లెవెల్లో కేంద్రం సాధించిన అభివృద్ధి కంటే, ఆంధ్రా చాలా సాధించిందన్నారు. ప్రధాని మోడీని విమర్శిస్తూ… అమలు చేయలేని పరిస్థితులో ఉంటే ఆరోజున తిరుపతికి వచ్చి, ఆంధ్రాని ఆదుకుంటామని ఎందుకు నమ్మబలికారని ప్రశ్నించారు.
కర్నూలు ధర్మ పోరాట దీక్షలో కూడా వైకాపా, భాజపాలను ఒకేగాటన కట్టి చంద్రబాబు నాయుడు మరోసారి విమర్శించారు. గత పోరాట సభల్లో కూడా ఇలానే మాట్లాడారు. అవినీతి పార్టీని భాజపా చేరదీస్తోందన్న అంశాన్నే మళ్లీ ప్రస్థావించారు. భాజపాపై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత ఉంది… దీంతోపాటు, వైకాపా కూడా ఆపార్టీకి కాస్త దగ్గరయ్యే క్రమంలో కనిపిస్తోంది. కాబట్టి, ఈ రెండూ ఒకటే అనే అభిప్రాయం వీలైనంత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నది టీడీపీ వ్యూహంగా చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి ప్రసంగాల్లో పదేపదే అదే ప్రయత్నం కనిపిస్తోందని చెప్పుకోవచ్చు.