విజయవాడలో బోండాగిరీ అంటూ ఈ మధ్య వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఓ భూకుంభకోణం వ్యవహారంలో అధికార పార్టీ ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు పేరు తెరమీదికి వచ్చింది. దాదాపు రూ. యాభై కోట్ల విలువ చేసే భూమిని రూ. ఐదు కోట్లకే ఆయన దక్కించుకునేందుకు పైరవీలు చేశారంటూ ఆరోపణలు వినిపించాయి. తాజా ఆరోపణల నేపథ్యంలో.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి ఎమ్మెల్యే బోండా ఉమ వెళ్లారు. విజయవాడలో సంచలనం సృష్టిస్తున్న ఈ భూకుంభకోణానికి సంబంధించి సీఎంకి వివరణ ఇచ్చినట్టు సమావేశం. అయితే, ఈ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఆగ్రహించారనీ, ప్రజా జీవితంలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి అంటూ హెచ్చరించారట. అంతేకాదు, ఈ మొత్తం వ్యవహారంపై వెంటనే నివేదిక ఇప్పటికే తెప్పించుకున్నానని, దాన్ని తాను స్వయంగా పరిశీలిస్తాననీ, వెల్లువెత్తుతున్న ఆరోపణలు వాస్తవాలు అని తేలినట్టయితే తక్షణం చర్యలకు వెనకాడేది లేదని కూడా ముఖ్యమంత్రి ఘాటుగా చెప్పినట్టు సమాచారం.
అధికారుల అండతో ఒక స్వతంత్ర సమరయోధుడికి సంబంధించిన భూముల్ని బోండా తన గుప్పిట్లోకి తెచ్చుకున్నారనేది ప్రధాన ఆరోపణ. రూ. 50 కోట్ల విలువ ఉన్న 5.16 ఎకరాల భూమిని రూ. 5 కోట్లకు దక్కించుకునేందుకు ఆయన మాస్టర్ ప్లాన్ వేసినట్టు కథనాలు వచ్చాయి. 1971 నుంచి 1988 మధ్య విజయవాడలోకి కొన్ని ప్రాంతాలకు సంబంధించి భూవివరాలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో పోయాయట. ఈ పాయింట్ ను తనకు అనుకూలంగా మార్చుకుని… స్వతంత్ర సమరయోధుడు సూర్య నారాయణ కుమారుడి దగ్గర మస్తాన్, ఆర్. కోటేశ్వరరావు అనే ఇద్దరు 1988లోనే ఈ భూమిని కొనుగోలు చేసినట్టు రెండేళ్ల కిందట డాక్యుమెంట్లు సృష్టంచినట్టు చెబుతున్నారు. అయితే, ఈ పత్రాలు ఆధారంగా 2016 జులైలో మ్యుటేషన్ చేయించారనీ, ఇలా చేసేందుకు రెవెన్యూ అధికారులు కూడా సహకరించారనీ ఆరోపణలున్నాయి. ఆ తరువాత, ఆ ఇద్దరు పేరిట ఉన్న భూమిని గత ఏడాది మార్చి నెలలో ఎమ్మెల్యే బోండా భార్య సుజాతతోపాటు మరో ఐదుగురికి జీపీయే చేసినట్టు కథనం. అయితే, తమ భూములను బోండా కుటుంబం అక్రమంగా లాక్కుందంటూ సూర్యనారాయణ మనవడు పోరాటానికి దిగారు. దీంతో ఈ వ్యవహారమంతా ఇప్పుడు తెరమీదికి వచ్చింది.
అయితే, ఈ ఆరోపణలపై బోండా ఇచ్చిన వివరణ ఏంటంటే… ఈ భూముల వెనక ఇంత మతలబు ఉందని తమకు సమాచారం లేదనీ, అందుకే గతంలో చేసుకున్న జీపీయేను కొన్నాళ్ల కిందటే రద్దు చేసుకున్నామని ఆయన అంటున్నారట! అయితే, సీఐడీ కేసు నమోదు చేశాకనే.. విచారణ నుంచి తప్పించుకోవడం కోసమే జీపీయే రద్దు చేసుకున్నారే ఆరోపణలు ఉన్నాయి. నిజానికి, ఈ వ్యవహారం నిన్ననే ముఖ్యమంత్రి దగ్గర ప్రస్థావనకు వచ్చినట్టు సమాచారం. ఎమ్మెల్యేల పనితీరు గురించి సీఎం సీరియస్ గా మాట్లాడుతున్న సందర్భంలో ఈ టాపిక్ వచ్చిందనీ, అక్కడే ఆయన కొంత ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. దీంతో ఇవాళ్ల వ్యక్తిగతంగా చంద్రబాబును కలిసి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు బొండా. నిజానికి, బోండా వ్యవహార శైలిపై గతంలో కూడా కొన్ని ఆరోపణలున్నాయి. తాజా ఆరోపణలు నిజమైతే చర్యలు తప్పవని చంద్రబాబు అంటున్నారు. మరి, ఈ వ్యవహారంపై చర్యలు ఎలా ఉంటాయో, ఎంత వేగంగా ఉంటాయో చూడాలి.