ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు అత్యంత అభ్యంతరకరంగా ఉందని.. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మండిపడ్డారు. తుపాను సహాయక చర్యల విషయంలో..కోడ్ మినహాయింపులు ఇవ్వకపోవడంపై.. ఆయన అసహనం వ్యక్తం చేశారు. తుపాను ప్రభావం ఉంటుందని.. భావిస్తున్న నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు… ఈసీకి లేఖలు రాశారని.. కానీ ఎవరికీ సమాధానం లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రులను అడుక్కునే స్థాయికి దిగజార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న తుపాను ముప్పుపై అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలను కోడ్ పేరుతో పని చేయనివ్వకుండా చేసి… కేంద్ర ప్రభుత్వం పెత్తనం చేయడం ఏమిటని మండిపడ్డారు. కేంద్రానికి కోడ్ అడ్డం ఉండదా.. అని ప్రశ్నించారు. ప్రధానికి ఒక రూలు… సీఎంలకు ఒక రూలా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రులు తుపాన్లు వచ్చినా సమీక్ష చేయొద్దా? ప్రధాని ఏదైనా మాట్లాడొచ్చా?.. రాజకీయాలు చేయొచ్చా? ప్రధానికి ఏ కోడ్ అడ్డురాదా..? అని సీఈసీకి ప్రశ్నల వర్షం కురిపించారు.
ఎన్నికల ప్రచారంలో మోదీ విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారు.. బాలాకోట్ దాడులను పదేపదే ప్రస్తావిస్తున్నారు అయినప్పటికీ.. ఈసీ ఎలాంటి చర్యా తీసుకోకపోవడం ఏమిటని..చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ఫ్రస్ట్రేషన్ పతాక స్థాయికి చేరిందన్నారు. ఎన్నికల ఫలితాలు ఎలా వస్తాయో అంచనా వేసుకుని… మోడీ ఫ్రస్ట్రేషన్‌తో వ్యవహరిస్తున్నారని… చంద్రబాబు అంటున్నారు. అందుకే విపక్షాల ఉనికిని కూడా సహించలేకపోతున్నారనన్నారు. గంటకో డ్రెస్ మార్చి ఆర్భాటంగా రాజకీయాలు చేస్తున్నారని… ఆయన చెప్పిన మార్పు.. డ్రెస్సుల్లోనే కనిపిస్తోందని సెటైర్ వేశారు. పద్ధతిగా రాజకీయాలు చేసే విపక్షాలను మోదీ ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు చంద్రబాబు. నాలుగు విడతలుగా జరిగిన ఎన్నికల్లో ప్రతీ సారి ఈవీఎంలు మొరాయించాయని… కౌంటింగ్‌లో.. వీవీ ప్యాట్ స్లిప్పుల్లో తేడా వస్తే ఏం చేయాలో ఎవరూ చెప్పలేకపోతున్నారన్నారు. యూపీలో ఎస్పీకి ఓటేస్తే బీజేపీకి ఓట్లు పడ్డాయన్నారు.మధ్యప్రదేశ్, యూపీ, బెంగాల్లోనూ ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు.
ఎన్నికల కోడ్ పేరుతో ఏపీలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై.. ముఖ్యంగా..సీఎస్ వ్యవహరిస్తున్న తీరుపై.. చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ బంగారం విషయంలో… చీఫ్ సెక్రటరీ.. అసలు తనకు చెప్పకుండానే… కమిటీ వేశారన్న విషయాన్ని బయట పెట్టారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉన్నప్పుడు…అధికారులే సొంతంగా కమిటీలు ఎలా వేస్తారని చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కమిటీ వేసి నివేదిక వచ్చిన తర్వాత రాటిఫికేషన్ కోసం తనకు పంపారని.. రాటిఫికేషన్ చేయడానికి ఉన్నానా … అని మండి పడ్డారు.
టీటీడీ విషయంలో తప్పు చేయని ఈవోను సీఎస్ ఎలా తప్పు పడతారని ప్రశ్నించారు. ఈసీ విషయంలో.. చంద్రబాబు… మరింత దూకుడుగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా.. ఆయన వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి.