రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము కేంద్రంలోని భాజపాతో పోరాటం సాగిస్తున్నామనీ, అనుకున్నది సాధించే వరకూ పోరాటం కొనసాగిస్తామన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నెల్లూరులోని ధర్మపోరాట దీక్షలో ఆయన ప్రసంగిస్తూ… భాజపాతోపాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్, ప్రతిపక్ష నేత జగన్ మీద కూడా విమర్శలు చేశారు. టీడీపీని దెబ్బతియ్యాలని భాజపా చూస్తోందనీ, అది ఎవరి వల్లా కాదన్నారు. వైకాపా, జనసేనలు లాలూచీ రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉంటే ఎందుకు పవన్ పోటీ చెయ్యలేదనీ, ఎందుకు జగన్ పోటీకి దిగలేదనీ… ఇదంతా లాలూచీ రాజకీయం కాదా అని ప్రశ్నించారు.
ఈరోజున రాజ్యాంగ పరమైన ఒక అత్యవసర పరిస్థితి ఉత్పన్నమైంది కాబట్టి, కాంగ్రెస్ తో తాము కలిశామన్నారు చంద్రబాబు నాయుడు. దేశంలో మనం ఒక్కరమే ఎదురెళ్లి ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎదుర్కోలేమనీ, మన శక్తికి తోడుగా దేశంలోని ఇతర రాజకీయ పార్టీలూ వెంట రావాలనీ, ఆ క్రమంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కూడా రావాలన్నారు. నలభై సంవత్సరాల భేదాభిప్రాయాలను పక్కనపెట్టి, తానే ఒక్క అడుగు ముందుకేసి దేశం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, మన రాష్ట్ర హక్కుల కోసం ముందుకొచ్చాను అన్నారు. జాతీయ స్థాయిలోని కీలక వ్యవస్థలన్నీ భాజపా భ్రష్టు పట్టిస్తున్న పరిస్థితి వచ్చిందన్నారు.
రాష్ట్రం కోసం ఏం చేశారంటూ తమను వైకాపా నేతలు ప్రశ్నించడం హాస్యాస్పదం అన్నారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడుతున్నప్పుడు.. ధైర్యముంటే తమతో రావాలని సవాలు విసిరామనీ, కానీ ఆ తరువాత ఏం జరిగిందో ప్రజలు చూశారన్నారు. వైకాపా ఎంపీలు రాజీనామాలు చేస్తే… సంవత్సరం కంటే తక్కువ సమయం ఉన్నట్టుగా చూసుకుని భాజపా ఆమోదించిందన్నారు. వీళ్లకి ఎన్నికలంటే భయమనీ, మోడీ అంటే వీళ్లకి భయమనీ, ఎందుకంటే ఈ నాయకుల మీద కేసులున్నాయన్నారు. ఎదురిస్తే జైలుకి పోతామన్న భయంతో రాష్ట్ర హక్కులను తాకట్టుపెట్టిన పార్టీ వైకాపా అని విమర్శించారు. పవన్ కల్యాణ్ కూడా నిజ నిర్ధారణ కమిటీ అంటూ హడావుడి చేశారనీ, ఆ తరువాత ఏమయ్యారని ప్రశ్నించారు? అవిశ్వాసం పెడితే మద్దతు కూడగడతానని సినిమా డైలాగ్ చెప్పి, అడ్రస్ లేకుండా పోయారని ముఖ్యమంత్రి విమర్శించారు.