కడప ఉక్కు కర్మాగారం కేంద్రం ఇవ్వకపోతే, రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటుకు పూనుకుంటుందని మరోసారి చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. విజయనగరంలో జరిగిన ధర్మపోరాట దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా… వైకాపా, జనసేన తీరుపై విమర్శలతోపాటు, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న క్రమాన్ని కూడా మరోసారి వివరించారు. కడప జిల్లా నుంచి కోడి కత్తి డ్రామా ఆడే ఒక మహా నాయకుడు ఉన్నాడనీ, ఆ జిల్లాలో ఉక్కు కర్మాగారం గురించి ఎందుకు నోరు మెదపడం లేదని ప్రతిపక్ష నేత జగన్ ను ఉద్దేశించి సీఎం అన్నారు. కేంద్రంపై మాట్లాడితే జైలుకు పోతామనే భయం ఆయనకి అన్నారు. డిసెంబర్లో కడప ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేస్తామంటూ మరోసారి చెప్పారు.
కేంద్రంలోని నరేంద్ర మోడీ పాలన అన్ని రకాలుగా విఫలమైందనీ, మన రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారు అని ఆరోపించారు. దేశంలోని భాజపాయేతర పక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందనీ, అందుకే వివిధ రాష్ట్రాలు తిరుగుతూ తనవంతు ప్రయత్నం చేస్తున్నానని చంద్రబాబు చెప్పారు. ఈ క్రమంలో దాదాపు నలభయ్యేళ్లుగా పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని కూడా కలుపుకుని వెళ్లాలని తనకు అనిపించిందన్నారు. తానే స్వచ్ఛందంగా వెళ్లి, కాంగ్రెస్ సాయం తీసుకున్నా అన్నారు. ఆ పార్టీ సాయం తీసుకుని పోరాటానికి సిద్ధమైంది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసమన్నారు. దేశం బాగుంటేనే మనం ఉంటామనీ, ప్రజాస్వామ్యం ఉంటేనే మనం మాట్లాడతామని ముఖ్యమంత్రి అన్నారు.
పాదయాత్రను జగన్ అపవిత్రం చేశారు అన్నారు. తిత్లీ తుఫాను వచ్చాక, బాధితులను కలుసుకునే ప్రయత్నం ఎందుకు చెయ్యలేకపోయారన్నారు. పాదయాత్రను మూడు రోజులు వాయిదా వేసుకుంటే కొంపలు కూలిపోవన్నారు. ప్రతీ గురువారం హైదరాబాద్ వెళ్లి, శుక్రవారం కోర్టులో ఉండి, మళ్లీ శనివారమో ఆదివారమో వచ్చి పాదయాత్ర చేస్తున్నారన్నారు. జగన్ అన్నిటికీ అడ్డుపడుతున్నారనీ, విశాఖలో పెట్టుబడిదారుల సదస్సు జరుగుతుంటే, జల్లికట్టు స్ఫూర్తితో ఏదో చేద్దామనుకున్నారు గుర్తుచేశారు.
తెలంగాణ ఎన్నికల గురించి మాట్లాడుతూ… అక్కడ మహా కూటమి పెట్టడం న్యాయమా కాదా చెప్పాలని ప్రజలను చంద్రబాబు కోరారు. కేసీఆర్ విమర్శల్ని ప్రస్థావిస్తూ… తాను హైదరాబాద్ నగరం కట్టానని ఎప్పుడూ చెప్పలేదనీ, నిజాం కట్టారనీ, కానీ సైబరాబాద్ తానే నిర్మించా అన్నారు చంద్రబాబు. తాను ఎప్పుడూ కేసీఆర్ ని తిట్టలేదనీ, ఆ అవసరం కూడా లేదన్నారు.