రాజకీయాలు ఎలా వున్నా ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనా వ్యవహారాలు బాగా నిర్వహించగలరనే అభిప్రాయం అందరికీ వుంది. హైదరాబాదులో ఐటి అభివృద్ధికి సైబరాబాద్ స్థాపనకు ఆయన చేసిన కృషిని ఇటీవల షెహజాదా కెటిఆర్ కూడా ప్రశంసించారు. అయితే చంద్రబాబుకు అదే ఒక అబ్సెషన్ కావడమే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎప్పుడూ హైదరాబాదును తను తీర్చిదిద్దిన విషయమే చెబుతూ అదే ఫార్ములా ఎపిలో అమలు చేయాలంటారు. ఎప్పుడూ పెట్టుబడులు తీసుకురావడం, ఐటి హబ్‌లు ఏర్పాటు చేయడం ఇదే మాట్లాడుతుంటారు. తాజాగా ఆయన తిరుపతిలో ఐటి సంస్థలను ప్రారంబిస్తూ సిలికాన్ వ్యాలీ తరహాలో ఆంధ్రావ్యాలీ అభివృద్ధి చేస్తానన్నారు.విశాఖ, అమరావతి, అనంతపురంలలో మరో మూడు ఐటి కేంద్రాలు పెంపొందిస్తానని ప్రకటించారు. ఐటి విస్తరిస్తున్న తొలిదశలో హైదరాబాద్ వంటి మహానగరంలో జరిగిన పనులే మాంద్యం నెలకొన్న స్తితిలో వ్యవసాయ ప్రధానమైన ఎపిలో ఎలా చేయగలరు? అంతర్జాతీయ సంస్థలు ఆ స్తాయిలో ఎలా తరలివస్తాయి? మన చొరవకు ప్రపంచ పరిస్తితులు సాంకేతిక పరిణామాలు కూడా తోడు కావాలి కదా .. ఇలాటి ప్రశ్నలు వేసుకోకుండా చంద్రబాబు లాటి అనుభవజ్ఞుడు నాటి హైదరాబాద్ మార్కు అభివృద్ధినే పదేపదే వల్లె వేయడం అవాస్తవికత అవుతుంది. అనవసరమైన ఆశలు పెంపొందిస్తే అందుకోవడం అసాద్యమూ అవుతుంది. అప్పటికి కాలానుగుణంగా వ్యవహరించిన చంద్రబాబు ఇప్పుడు కూడా రాష్ట్ర కాల పరిస్తితులకు అనుగుణంగా స్పందించాలి తప్ప అదే జపిస్తూ కూచుంటే ఉపయోగం లేదు.