నూతన సంవత్సరం జన్మభూమి ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక బహిరంగ లేఖ రాశారు. ప్రతివారూ సొంతవూరికి వచ్చి సేవ చేయడం వంటి పిలుపులతో పాటు రాజకీయంగానూ అనేక విషయాలు చెప్పారు. గతంలో తాను అభివృద్ది చేస్తే పదేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం వెనబడిపోయిందని విభజనతో పూర్తిగా కుదేలైనామని వ్యాఖ్యానించారు. రాజధాని ఎక్కడో తెలియక కట్టిన సంస్థలు పోగొట్టుకుని వచ్చినా సమర్థంగా పాలన అందించగలిగామన్నది ఆయన సారాంశం. నూతన రాజధాని నిర్మాణాలు ప్రారంభమవుతాయన్నారు. ఈ లేఖలో విశేషమేమంటే ఎప్పటిలా ప్రతిపక్షం కల్పించే అడ్డంకులను చెప్పకపోవడం.. కాంగ్రెస్ గుండెల్లో కత్తులుదించిందని విభజన పరిస్థితిని ప్రస్తావించారే గాని వైసీపీకి దాని నాయకుడు జగన్కు వర్తించే తీవ్ర వ్యాఖ్యలు చేయలేదు.అలాగే కేంద్రం నుంచి ప్రత్యేక హౌదా నిరాకరణ, పోలవరం నిధుల జాప్యం వంటి సమస్యలను కూడా ప్రస్తావించలేదు.్ బిజెపికి జగన్ చేరువవుతున్నారన్న నేపథ్యం ఇందుకు కారణమేమో తెలియదు. పైగా మన విజయాలను వదలిపెట్టి ప్రతిపక్ష నేతను అతిగా విమర్శించడమెందుకని టిడిపిలో ఒక పెద్ద భాగం వాదిస్తున్న కారణంగా ఆయన ధోరణి మారి వుండొచ్చు.