ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు కర్నూలు జిల్లాలో పర్యటించి సిద్దాపురం ఎత్తిపోతల పథకం ప్రారంభించారు. ఇది బాగానే వుంది గాని ఆయన పదేపదే కర్నూలు జిల్లాకు రావడం పట్ల ఆ జిల్లా అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కొద్ది కాలంలోనే అయిదారు సార్లు సందర్శించారు. రాయలసీమలో వైసీపీని దెబ్బతీయాలంటే కర్నూలు కడప కీలకమని ఆయన భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో చాలా మందిని ఫిరాయింపచేసినప్పటికీ కర్నూలు ఎంఎల్ఎ ఎస్వి మోహనరెడ్డికి ఎంపి టిజీ వెంకటేశ్ కుమారుడు భరత్‌కూ మధ్య వచ్చేసారి టికెట్‌పై బహిరంగంగానే వివాదం టిడిపికి ఇరకాటంగా మారింది. చంద్రబాబు రాకకు ఒక రోజు ముందే ఎస్వి సూటిగా భరత్‌పై వ్యాఖ్యలు చేశారు.అయితే ఆయన పర్యటన సమయంలో ఆ వూసే రాలేదు.జన్మభూమి అధికార కార్యక్రమం అన్న పేరిట ప్రభుత్వ పథకాలపైనే కేంద్రీకరణ నడిచింది. ఉపముఖ్యమంత్రి కెఇకృష్ణమూర్తి సోదరుడికి ఇటీవల ఎంఎల్‌సి ఇచ్చి సంతృప్తి పరచినా కీలక నిర్ణయాలలో తన మాట లేకుండా పోయిందనే బాధ ఆయనలో అలాగే కొనసాగుతున్నది.సామాజికంగా కీలకమైన ఈ జిల్లాలో కాస్త తేడా వస్తే వైసీపీ బలపడొచ్చు గనక ఏ మాత్రం అవకాశం ఇవ్వరాదన్న ఆలోచన చంద్రబాబును పదేపదే రప్పిస్తున్నదని అధికారుల భావనగా వుంది.ఆయన విడియో కాన్ఫరెన్సులకు తోడు జిల్లా కలెక్టర్ కూడా స్వంతంగా పెట్టే వాటితో తమకు వేరే పనులు చూసుకునే తీరికే వుండటం లేదని వారు వాపోతున్నారు.