తెలంగాణ ఏర్పడ్డాక ఆంధ్రాలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. నిజానికి, వైకాపాకు మాంచి వేవ్ ఉన్నా సరే… కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని ప్రజలు భావించారు. చంద్రబాబును ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు. రెండున్నరేళ్లు పూర్తయింది. చంద్రబాబు మార్కు అభివృద్ధి ఏది.. అనే ప్రశ్న ఇవాళ్టికి చిన్నదే. కానీ, మరో రెండేళ్ల వరకూ ఈ ప్రశ్నకు సమాధానం చంద్రబాబుకే కనిపించడం లేదు! అందుకే, పోలవరం ప్రాజెక్టును ఒక జవాబుగా చెప్పుకునే ప్రయత్నం ఇప్పట్నుంచీ ముమ్మరం చేశారని చెప్పుకోవాలి.
పోలవరం ప్రాజెక్టుకు స్పిల్ వే కాంట్రీట్ పనుల్ని శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కొంతమంది కేంద్రమంత్రులు కూడా ఈ శంకుస్థాపనకు వస్తారని అనుకున్నా… ఎవ్వరూ రాలేదు! ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… ఈ ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి కావాలని ప్రజలు దేవుడిని ప్రార్థించాలని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తున్న ప్రధానితోపాటు కేంద్రమంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. నాబార్డు నుంచి దాదాపు రూ. 2 వేల కోట్ల రుణం మంజూరు అయిన సంగతి తెలిసిందే.
పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తిచేస్తామని గడచిన రెండేళ్లుగా చెబుతున్నారు. వాస్తవంలో ఇంతవరకూ జరిగిన పనులు నత్తనడకనే సాగుతున్నాయి. కానీ, ఇకపై ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం కావాలని ముఖ్యమంత్రి పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. అంతేకాదు, చంద్రబాబు నాయుడు దగ్గరుండి మరీ కొన్ని కంపెనీలకు పనులు అప్పగించి, త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశిస్తున్నారు. అయితే, ఉన్నట్టుండీ చంద్రబాబు పోలవరంపై ఇంత తొట్రుబాటుతో పనులపై ప్రత్యేక శ్రద్ధ ఎందుకు పెడుతున్నట్టు..?
మరో రెండున్నరేళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల నాటికి తెలుగుదేశం సాధించింది ఏంటీ.. అని చెప్పుకోవాలంటే ఏముంటాయి..? రాజధాని అమరావతి ఇప్పట్లో పూర్తయ్యేట్టు లేదు. నమూనాలే ఫైనలైజ్ ఇంకా ఫైనలైజ్ కాకపోతే నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుంది..? అమరావతి పనులు నత్తనడకనే సాగుతున్నాయి. కాబట్టి, కనీసం పోలవరం ప్రాజెక్టునైనా ఓ కొలీక్కి తీసుకొస్తే రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవుతుంది. ఒకవేళ ఇది కూడా ఆలస్యమైతే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులు తప్పవనే విషయం చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకే, ఆఘమేఘాల మీద పోలవరం పనుల్ని పరుగులు తీయించి, ఓ కొలీక్కి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందుకే, ముఖ్యమంత్రి శ్రద్ధ ఎక్కువగా ఉందని సమాచారం. ఎన్నికలు వచ్చే నాటికి పోలవరం పూర్తి కాకపోయినా ఫర్వాలేదు, కానీ చెప్పుకోవడానికైనా పనులు ఒక కొలీక్కి తీసుకుని రావాలి కదా! ఏంటో… ఎన్నికల కోసం ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్టుగా ఉంది!