పరిపాలన విషయంలో ప్రజల హృదయాలను గెలుచుకునే విషయంలో చంద్రబాబునాయుడుకు ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవడం చాలా సులువుగా మారిపోతున్నట్లు కనిపిస్తోంది. తనను తాను మంచి ఎడ్మినిస్ట్రేటర్‌గా జనం గుర్తించాలని చంద్రబాబునాయుడు కోరుకుంటారు. ఏపీ సీఈవోగా కీర్తించాలని అనుకుంటారు. కానీ ఆఫీసులో బాస్‌ను ఎంప్లాయీస్ ఎలా తిట్టుకుంటారో ఆయనకు తెలియకపోవచ్చు. సీఈవోలా జనం తిట్టుకునే పాలన కాకుండా, జనం మనసులు గెలుచుకునే పాలన నిర్ణయాలు తీసుకోవడానికి ఇప్పుడు ఆయన ఎదుట రోల్ మాడల్ లాగా కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఉపయోగపడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే పలు విషయాల్లో కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నట్లుగా నిర్ణయాలు తీసుకుంటున్న చంద్రబాబు.. శనివారం నాడు జరగబోతున్న కేబినెట్ భేటీలోను కీలకమైన అలాంటి మరో నిర్ణయం తీసుకోబోతున్నారు.
త్వరలోనే ఏపీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి, యువతరం దగ్గర మంచి మార్కులు కొట్టేసేలా.. వయోపరిమితిని కూడా పెంచడానికి చంద్రబాబు సర్కారు నిర్ణయించనున్నట్లుగా తెలుస్తున్నది. వయోపరిమితి పెంచడం అంటే నిరుద్యోగ వర్గాలకు అది చాలా పెద్ద వరం కింద లెక్క. చాన్నాళ్లుగా ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు జరగకుండా ఆగిపోయిన నేపథ్యంలో.. సాధారణ నిబంధనల ప్రకారం ఏజిబార్ అయిపోయిన నిరుద్యోగులు పెద్దసంఖ్యలోనే ఉంటారు.
సాధారణ నిబంధనల ప్రకారం ఇప్పుడు రిక్రూట్ మెంట్లు జరిపితే గనుక.. అలాంటి వారందరికీ అవకాశం అనేది ఒక్కసారైనా తలుపు తట్టకుండానే కోల్పోయినట్లు అవుతుంది. అందుకే కేసీఆర్ సర్కారు వయోపరిమితిని భారీగా సడలిస్తూ నిర్ణయాలు తీసుకున్నది. ఇవాళ జరగబోయే కేబినెట్ సమావేశంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా అదే నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఏపీలో గతంలో నిర్వహించిన డీఎస్సీకి సంబంధించి నియామకాల్ని సత్వరం పూర్తి చేయాలని కూడా చంద్రబాబు ఆదేశించారు. త్వరలోనే ఇతర ఉద్యోగాల భర్తీకి, వయో సడలింపు తో ప్రక్రియ మొదలుకాబోతోంది. ఈ లెక్కన రాబోయే నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉద్యోగాల, కొలువుల జాతర నడుస్తుంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
‘బాబు వస్తే జాబు వస్తుంది’ అనే హామీతో దారుణంగా మోసం చేశారంటూ వైకాపా కోటరీ చంద్రబాబు మీద తీవ్రాతి తీవ్రంగా ప్రతి సందర్భంలోనూ విమర్శలు గుప్పిస్తూనే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే.. రాష్ట్రంలో నడి వయసులో ఎవరు ఆత్మహత్య చేసుకున్నా సరే.. బాబును చెప్పిన ఈ హామీని నమ్మి ఓటు వేస్తే.. ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వకపోవడం వల్లనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా కథనాల్ని కూడా వైకాపా ప్రచారంలో పెడుతూ ఉంటుంది. ఇప్పుడు సర్కారు కొలువుల జాతరకు తెరలేపితే.. ఈ విమర్శల దూకుడు కాస్త తగ్గే అవకాశం కూడా ఉంది.