రాజ్యసభలో నిన్న ప్రత్యేక హోదా తదితర హామీల అమలు గురించి కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ఇచ్చిన జవాబు పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హామీలు అమలుచేయమని అడిగిన ప్రతీసారి 14వ ఆర్ధిక సంఘం పేరు చెప్పి తప్పించుకోవడం సరికాదని అన్నారు. కేంద్రప్రభుత్వం దేశంలో మిగిలిన రాష్ట్రాలకి ఇస్తున్నట్లుగానే నిధులు ఇస్తోంది తప్ప ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకంగా ఇచ్చిందేమీ లేదని స్పష్టం చేశారు. రాజధాని, పోలవరం నిర్మాణం కోసం ఇచ్చిన అరకొర నిధులతో అవి ఎన్నటికీ పూర్తికావని చెప్పారు. రాష్ట్ర సమస్యల పరిష్కారానికి, హామీల అమలుకి 4-5మందితో ఒక కమిటీ వేయాలని కోరారు. ఏపికి ఇచ్చిన హామీలని అమలుచేయకపోవడం తాను కుట్రగా భావించడం లేదు కానీ అన్యాయం జరుగుతున్నట్లు భావిస్తున్నానని చెప్పారు. కేంద్రం నిధులు ఇవ్వదని తెలిసిన తరువాత ఇక డిల్లీ వెళ్ళడం కూడా అనవసరమేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహాయం అవసరం ఉందనే ఇంకా ఓపికగా ఎదురుచూస్తున్నాను లేకుంటే ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి రెండు నిమిషాలు పట్టదని అన్నారు.
ఇవన్నీ ముఖ్యమంత్రి ఈరోజు కొత్తగా చెపుతున్నవి కావు. పార్లమెంటులో కేంద్రం ఏపికి హ్యాండ్ ఇచ్చిన ప్రతీసారి ఇదే చెపుతున్నారు. కనుక కేంద్రం పట్ల ఆయన వైఖరిలో కూడా నేటికీ ఎటువంటి మార్పు లేదని స్పష్టం అవుతోంది. ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని అరుణ్ జైట్లీ రాజ్యసభలో చెప్పినందున రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్షాలు చాలా ఆగ్రహంతో ఉన్నారు. కనుక వారి ఆగ్రహాన్ని చల్లార్చేందుకు లేదా దానిని తన పార్టీపైకి మళ్ళకుండా కేంద్ర్మ్పైకి మళ్ళించేందుకే ముఖ్యమంత్రి ఈవిధంగా మాట్లాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వారం పది రోజుల తరువాత రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు వేరే ఏదో సమస్యకి ‘షిఫ్ట్’ అయిపోతాయి కనుక అప్పుడు ఈ వేడి చల్లారిపోతుంది. అప్పుడు తెదేపా-భాజపాలు మళ్ళీ యధాప్రకారం కలిసి పనిచేసుకొంటాయి.
ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి రెండు నిమిషాలు పట్టదని ముఖ్యమంత్రి చెప్పడం భాజపాతో తెగతెంపులు చేసుకోవడం గురించేనని వేరేగా చెప్పనవసరంలేదు. ఈరోజు కాకపోయినా రేపయినా భాజపాతో తెగతెంపులు చేసుకొనే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికలలో ఒకవేళ భాజపాతో దోస్తీ వలన తెదేపాకి నష్టం జరుగుతుందని ముఖ్యమంత్రి భావిస్తే దానితో తప్పకుండా తెగతెంపులు చేసుకొంటారు. ఆ సంగతి భాజపాకి, కేంద్రప్రభుత్వానికి కూడా చాలా బాగా తెలుసు. కనుకనే ఎవరి జాగ్రత్తలో వారు ఉంటున్నారు.
ఏపికి ప్రత్యేక హోదా,ఇతర హామీలు అమలుచేయకపోవడం కుట్ర కాదని కేవలం అన్యాయం మాత్రమే అని ముఖ్యమంత్రి చెపుతున్నప్పటికీ, కేంద్రప్రభుత్వం రాజకీయ దురుదేశ్యంతోనే ఏపికి సహాయం చేయడం లేదని ముఖ్యమంత్రి చెప్పకనే చెపుతున్నారని భావించవచ్చు. అది ముందు జాగ్రత్తగా అంటున్న మాటలుగానే భావించవచ్చు.