బీజేపీయేతర కూటమి వ్యవహారాల్లో తదుపరి కార్యాచరణపై చర్చించేదుకు అమరావతికి వచ్చిన రాహుల్ సన్నిహితుడు అశోక్ గెహ్లాట్ చంద్రబాబుతో సుదీర్ఘంగా చర్చించారు. నరేంద్రమోడీ, అమిత్ షా ల నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి కూటమి కడుతున్నామని ప్రకటించారు. రాజ్యాంగ వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయని ..రైతులు, చిన్న వ్యాపారులు, సామాన్య ప్రజలు… ఎటు చూసినా తీవ్ర ఆవేదనలో ఉన్నారని… చంద్రబాబుతో కలిసి సంయక్త మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. ఇలాంటి దుస్థితి స్వాతంత్ర్యం వచ్చాక ఎప్పుడూ లేదని గెహ్లాట్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదాయం పెరుగుతుందని పెద్దనోట్లు రద్దు చేశామని ఆర్బీఐ గవర్నర్ చెబుతున్నారు .. ఆదాయం పెరిగే మార్గాలు, వ్యవస్థను నిర్మించే ఆలోచనలు వారికి ఏమాత్రం లేవని మండిపడ్డారు. ఐటీ, సీబీఐ, ఈడీ అన్ని వ్యవస్థలపై తీవ్రమైన ఒత్తిడి ఉందని దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోందన్నారు. ఆరెస్సెస్, బీజేపీలాంటి శక్తులకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదన్నారు. నవంబర్ 1న రాహుల్, చంద్రబాబు సమావేశంలో చర్చించిన విషయాలపై ఎలా ముందుకు వెళ్లాలనేదిదానిపై చర్చించేందుకే వచ్చానని తెలిపారు. దేశవ్యాప్తంగా సేవ్ డెమోక్రసీ పేరుతో కూటమిగా ఏర్పడుతున్నామని ప్రకటించారు.
మోడీ ఎవరు చెప్పినా వినరు, ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నారని.. మోదీ, అమిత్షా దేశాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. దేశాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సి ఉందన్నారు. అన్ని పార్టీలతో కలిపి బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు చేస్తామని.. ఈనెల 19, 20 తేదీల్లో మమతాబెనర్జీని కలుస్తానని చంద్రబాబు ప్కటించారు. జాతీయ రాజకీయ పరిస్థితులను అశోక్గెహ్లాట్తో చర్చించానని చంద్రబాబు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని పార్టీలు కాంగ్రెస్తో కలవకపోయినా బీజేపీ వ్యతిరేక కూటమిలో మాత్రం భాగస్వాములవుతాయన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో ఉన్న పార్టీలన్నీ ఒక వేదికపైకి రావడం ఇప్పుడు అత్యవసరమని గుర్తు చేశారు. అందరినీ కలుపుకుపోవడం ఎలాగో ఇప్పుడు ఆలోచిస్తున్నామన్నారు. దేశంలో ఇప్పుడు రెండే కూటములున్నాయని… ఒకటి బీజేపీ అనుకూల కూటమి .. రెండోది బీజేపీ వ్యతిరేక కూటమి అన్నారు. ఎవరే కూటమిలో ఉన్నారో పార్టీలు ఆలోచించుకోవాలని తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలను చంద్రబాబు టార్గెట్ చేశారు. టీఆర్ఎస్ ఏ కూటమిలో ఉందో తేల్చుకోవాలన్నారు.
పార్టీలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఒకే వేదికపైకి రావడం ప్రజాస్వామ్య అనివార్యత అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలంటే పార్టీలన్నీ ఒక్కటిగా నడవాల్సిందే… మరో దారి లేదన్నారు. తనతో ఎవరైనా టచ్లోకి వచ్చినా, మాట్లాడినా తెల్లారే ఐటీ దాడులు చేయిస్తున్నారని.. ఇదా ప్రజాస్వామ్యం అని చంద్రబాబు మండిపడ్డారు. ఒక్క బీజేపీకే ఆర్థిక వనరులు అందుబాటులో ఉండాలని మోదీ అనుకుంటున్నారున్నారు. ఏపీకి ఒక్కటే కాదు… మోదీ మూలానా దేశమంతా ఇబ్బంది పడిందన్నారు. రాజకీయ పార్టీల నేతలను కలిసినప్పుడు వారి కష్టాలను చెబుతున్నారని బీజేపీ ఎలా వేధిస్తుందో వివరిస్తున్నారన్నారు. నాపైనా సీబీఐ, ఐటీ దాడులు జరగొచ్చేమో… నేను ఖాతరు చేయననని స్పష్టం చేశారు. ఢిల్లీలో సమావేశమై అన్ని పార్టీలతో ప్రతి విషయంపై చర్చిస్తామని అప్పుడే స్పష్టత వస్తుందని చంద్రబాబు భవిష్యత్ కార్యాచరణ గురించి చెప్పారు. ఏకపక్షంగా వ్యవహరిస్తే రాజకీయంగా కలిసి నడవడం కుదరదని.. తెలంగాణలో పొత్తు తెంచుకున్నట్టు బీజేపీ ఏకపక్షంగా ప్రకటించిందని గుర్తు చేశారు. కలిసి నడుద్దామని కేసీఆర్ను కోరినా ముందుకు రాలేదన్నారు. జాతీయ స్థాయిలో ఇలాంటి ధోరణి మంచిది కాదని.. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ ఒక వేదికపైకి రావాలి, అదే మా ప్రయత్నన్నారు.