సబ్బం హరి.. కాంగ్రెస్ ఎంపిగా తర్వాత జగన్కు సన్నిహితుడుగా ఆపైన దూరమైన నేస్తంగా వివిధ దశలో టీవీ చర్చల్లో పాల్గొనే వారు. రాజకీయ నాయకుడుగా గాక విశ్లేషకుడి తరహాలో మాట్లాడ్డం ఆయనకు అలవాటు. అవతలివారిని గౌరవిస్తూ వివాదాస్పదంగా గాక వివరణాత్మకంగా తను చెప్పాలనుకున్నది చెబుతున్నట్టు కనిపిస్తారు. కాని గట్టి అభిప్రాయాలున్న వ్యక్తి. నంద్యాల ఉప ఎన్నిక ఫలితంపై చర్చ జరుగుతున్న వేళ ఆయన వివిధ ఛానళ్ల చర్చలో పాల్గొన్నారు. దీనికి ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక సూచన వున్నట్టు సమాచారం. జనసేన పవన్ కళ్యాణ్ మద్దతు లేకున్నా చంద్రబాబు ఘన విజయం సాధించారనేది ఆయన ప్రధాన ప్రశంస. బిజెపి కూడా పాక్షిక పాత్రే నిర్వహించింది గనక ఇది 2014లో వలె గాక ఇప్పుడు వ్యక్తిగతంగా ఆయన సాధించిన విజయమేనన్నది సూత్రీకరణ. పనిలో పనిగా మరో రెండు ప్రశంసలేమంటే- చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాష్ట్రానికి ఏకైక పెద్ద దిక్కుగా వున్నారు గనకే కేంద్రం అవ మానించినా భరిస్తున్నారు. ఇది హరి వాదన సారాంశం. వెంకయ్య నాయుడు క్రియాశీల రాజకీయాల నుంచిదూరమైనారు గనక ఇప్పుడు పెద్ద దిక్కు పాత్ర చంద్రబాబుకే బదలాయించడం జరిగినట్టు కనిపిస్తుంది. మరి ముఖ్యమంత్రి ఎలాగూ అలాటి పాత్ర వహించాల్సిందేగదా అని నేనంటే ఎంతమంది బాధ్యతగా పనిచేస్తున్నారని ఆయన ప్రశ్న. మా చర్చ చాలాసేపే జరిగింది. తర్వాత ఇతరులూ మాట్లాడారు. మొత్తంపైన సారాంశమేమంటే సబ్బం హరి ఒక ప్రత్యేక పాత్రలో ప్రభుత్వాధినేతపై ప్రశంసలు కురిపించే పని తీసుకున్నట్టు కనిపిస్తున్నారు.