ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏపీలో ఎన్నికల భేరీని మోగించబోతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు… మోడీని విభిన్నంగా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. మోడీ ఏపీకి రాక ముందే… నాలుగున్నరేళ్లలో ఆయన చూపించిన వివక్ష ప్రజల ముందు ఉంచడానికి సిద్ధమయ్యారు. పనిలో పనిగా తాను చేసిన అభివృద్ధినికూడా.. హైలెట్ చేయబోతున్నారు. అందు కోసం చంద్రబాబు ఎంచుకున్న వ్యూహం “శ్వేతపత్రాలు”. 2014లో అధికారంలోకి వచ్చిన నాడు రాష్ట్రం ఉన్న పరిస్థితి పై ఆనాడు శ్వేత పత్రాలను విడుదల చేసిన ముఖ్యమంత్రి తాజాగా ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు, తీసుకువచ్చిన ప్రాజెక్టులపై శ్వేతపత్రాలను విడుదల చేయాలని నిర్ణయించారు.
శ్వేతపత్రం అంటే… ఆయా రంగాల్లో ఉన్న ఏ టూ జడ్ వివరాలు ప్రకటించడం. గతంలో ఎలా ఉంది..ఇప్పుడెలాఉందో.. వివరించడం. నాలుగున్నరేళ్ల కాలంలో.. కేంద్రం రాష్ట్రానికి ఏమివ్వాలి..? ఏమిచ్చింది అనే అంశాన్ని హైలెట్చే
యబోతున్నారు. కేంద్రం నుంచి సాధారణంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, ప్రత్యేక హోదా అమలు చేయకపోవడం వంటి అంశాలపై ప్రజల ముందు వాస్తవాలను “వైట్ పేపర్ల” ద్వారా ఉంచాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రెవిన్యూ లోటు నుంచి పోలవరం వరకూ.. ఏ విషయంలోనూకేంద్రం సాయంపై ప్రభుత్వం సంతృప్తిగా లేదు. జాతీయప్రాజెక్టుగా కనిపించినప్పటికీ నేటికీ నాలుగు వేల కోట్ల రూపాయల నిధులు బకాయిల రూపంలో ఉన్నాయి. ఇవన్నీ శ్వేత పత్రంలో ప్రకటించి మోడీ రాకముందే ఈ పత్రాన్ని విడుదల చేయాలని చంద్రబాబు నిర్ణయించారు.
నరేంద్ర మోడీ జనవరి 6వ తేదీన రాష్ట్రానికి రాబోతున్నారు. జనవరి మొదటి వారంలో చంద్రబాబు శ్వేత పత్రాల విడుదలను ప్రారంభించనున్నారు. వీటి ద్వారా ఎన్నికలకు ముందే ఎవరేమిటో.. తేలిపోతుందని టీడీపీ నేతలు అంటున్నారు. మరి శ్వేతపత్రాలకు బీజేపీ సమాధానం చెబుతుందా..? అన్నదే టీడీపీ నుంచి వస్తున్న ప్రధానమైన ప్రశ్న.