ఖచ్చితంగా రాజకీయ పాలనే చేస్తానని టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చంద్రబాబు కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కూడా అదే చెప్పారు. ఇప్పుడు అదే చెప్పారు. అసలు రాజకీయ పాలన అంటే ఏమిటి ? చంద్రబాబు ఎందుకు రాజకీయ పాలన గురించి చెబుతున్నారు ? ఈ నాలుగు నెలల్లో రాజకీయ పాలన జరిగిందా.. అధికారుల పాలన జరిగిందా ?
అధికారులపై ఎక్కువగా ఆధారపడే సీఎం చంద్రబాబు
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే పార్టీని పట్టించుకోరన్న ఆరోపణలు వస్తూంటాయి. పూర్తిగా కొంత మంది అధికారుల్ని కోటరీగా పెట్టుకుని వారితోనే మొత్తం పనులు చేసేస్తూంటారు. ప్రభుత్వ పరంగా అయితే పర్వాలేదు పార్టీ వ్యవహారాలను చక్కబెట్టాడానికి కూడా ఇదే పద్దతి పాటిస్తారు. దాంతో చాలా వరకూ పార్టీకి.. చంద్రబాబుకు కనెక్షన్ తెగిపోతుంది., దీంతో తర్వాత ఎన్నికల్లో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సారి అలాంటి గ్యాప్ రానివ్వనని ఖచ్చితంగా రాజకీయ పాలన చేస్తానని అంటున్నారు.
జగన్ రెడ్డితో చేతులు కలిపి బుద్ది చెప్పిన అధికారులు
సివిల్ సర్వీస్ అధికారులు ప్రతిభావంతులని వారు చెప్పినట్లుగా చేసుకొస్తారని చంద్రబాబు అనుకుంటారు. కానీ వారిని ఎలా వాడుకోవాలో జగన్ చూపించారు. దాదాపుగా ప్రతి ఒక్కరిని గుప్పిట్లో పెట్టుకుని చంద్రబాబును .. టీడీపీని ఎంత వేధించాలో అంత వేధించారు. ఆ అధికారులు కూడా జగన్ చెప్పింది చేశారు. ఇలాంటి అధికారుల్ని పక్కన పెట్టుకోవడం కన్నా పార్టీ నేతల్ని నమ్ముకోవడం మంచిదని చంద్రబాబు ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చారని అనుకోవచ్చు.
రాజకీయ పాలనే చేస్తున్న చంద్రబాబు
చంద్రబాబు గతంలోలా ఇప్పుడు అధికారుల కోటరీలో లేరు. ఏ అధికారికి అవసరానికి మించి చనువు ఇవ్వడం లేదు. ఇంకా చెప్పాలంటే పార్టీ నేతలకు ఎక్కువ యాక్సెస్ ఇస్తున్నారు వీలైనంత వరకూ చెప్పేది వింటున్నారు. నమ్మకమైన రిపోర్టుల్ని ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నారు. అంతకు మించి పాలన కారణంగా పార్టీ బలోపేతం అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు .ఇవన్నీ రాజకీయ పాలనలో భాగం అనుకోవచ్చు. కానీ రాజకీయపాలన అంటే వైసీపీని రాచి రంపాన పెట్టడం అని చాలా మంది అనుకుంటున్నారు. దానికీ సమయం వస్తుందని ఆశిస్తున్నారు.