స్వపక్షంలో విపక్షం అన్నట్టుగా ఉంటుంది టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీరు! బహుశా, సొంత పార్టీలోని లోటుపాట్లను ఎప్పటికప్పుడు ధైర్యంగా ఎత్తిచూపేంత స్వేచ్ఛ ఆయనకు మాత్రమే ఉందని చెప్పాలి! టీడీపీ సర్కారు తీరును తీవ్రస్థాయిలో విమర్శించాలన్నా… అమాంతంగా ఆకాశానికి ఎత్తేయాలన్నా ఆయనకే చెల్లు. మొదట్నుంచీ ఆయన మాట తీరే అలా ఉంటుంది. ఆయన వ్యవహార శైలి ఇలానే ఉన్నా కూడా చంద్రబాబు సీరియస్ గా తీసుకున్న సందర్భాలు లేవనే చెప్పాలి. అలాగని, జేసీ విమర్శల్ని విశ్లేషాత్మక దృష్టితో సమీక్షించుకునేంత సీన్ కూడా ఉండదు. అయితే, తాజాగా జేసీ చేసి కొన్ని సూచనలు ముఖ్యమంత్రి చంద్రబాబును ఆలోచింపజేసేలానే ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమౌతోంది!
తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు జేసీ వెళ్లారట! ఈసారి కాస్త హోమ్ వర్క్ చేసుకునే చంద్రబాబు ముందు ఓపెన్ గా మాట్లాడటానికే సిద్ధమై వెళ్లారట. జేసీ కోరినట్టుగానే చంద్రబాబు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో మాట్లాడుతూ.. చేదుగా వినిపించినా సరే కొన్ని నిజాలు చెబుతాననీ, పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వీటిని సావకాశంగా వినాలంటూ జేసీ అన్నారట! ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా రావాల్సినంత ప్రచారమూ గుర్తింపూ దక్కడం లేదని చంద్రబాబుతో జేసీ చెప్పారట. పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న కొన్ని అంశాలను సీఎం ముందుంచినట్టు సమాచారం. అంతేకాదు, చంద్రబాబు తీరును కూడా కాస్త మార్చుకోవాలన్నట్టుగా సలహాలు ఇచ్చినట్టు చెబుతున్నారు.
ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల గురించి టీడీపీ నేతలు చెప్పుకోవడం లేదనీ, రాజధాని ఏర్పాటు కారణంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున భూముల ధరలు పెరిగి ఎంతోమంది లాభపడ్డారనీ, ఆ విషయాన్ని కూడా ప్రచారం చేసుకోలేకపోయామంటూ జేసీ చెప్పినట్టు సమాచారం. ఈ సందర్భంగా పార్టీలో కొంతమంది తీరుపై జేసీ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇలాంటి నేతలపై వెంటనే చర్యలు తీసుకోవాలనీ, ఆ చర్యల గురించి పార్టీలో అందరికీ తెలియాలనీ, అప్పుడే క్రమశిక్షణ అలవడుతుందని చంద్రబాబుతో జేసీ చెప్పినట్టు సమాచారం.
జేసీ చెబుతున్నంతసేపూ ఎంతో ఆసక్తిగా చంద్రబాబు విన్నారట. జేసీ సూచనలు పార్టీ బాగుకు పనికొచ్చేలా ఉన్నాయనే ధోరణిలో చంద్రబాబు స్పందించినట్టు చెప్పుకుంటున్నారు. అంటే, ఇన్నాళ్లకు జేసీ నచ్చినట్టు అనుకోవచ్చు! ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రచారం పెంచాలని జేసీ సూచించడం చంద్రబాబుకు బాగా నచ్చి ఉంటుంది! ఎందుకంటే, చంద్రబాబుకు కావాల్సింది అదే కదా..!