విజయవాడలో జరిగిన జ్ఞాన భేరీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రాష్ట్ర విభజన తరువాత, 60 ఏళ్ల కష్టాన్నీ హైదరాబాద్ ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చామన్నారు. చాలామంది అధైర్య పడ్డారనీ, ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని వేరేవాళ్లయితే అభివృద్ధి చెయ్యలేరని ప్రజలు తనను నమ్మారన్నారు. ఆ నమ్మకాన్ని నిలుపుకోవడం కోసం అనునిత్యం పనిచేస్తున్నా అన్నారు. విభజన తరువాత ఆంధ్రాకి అన్ని రకాలుగా సాయం అవసరమని విభజన చట్టంలో చాలా అంశాలు పెట్టారు, ప్రత్యేక హోదా కూడా ఇస్తామన్నారన్నారని గుర్తు చేశారు. ప్రత్యే హోదాగానీ, పోలవరంగానీ, విశాఖ జోన్ గానీ, అమరావతి నిర్మాణం, కడపలో ఉక్కు పరిశ్రమ…ఇలాంటివేవీ కేంద్రం నెరవేర్చిన పరిస్థితి లేదన్నారు.
నాడు నరేంద్ర మోడీకి మద్దతు ఇచ్చామనీ, ఎన్డీయేలో భాగస్వాములయ్యామనీ, ఇవన్నీ చేసింది అధికారం కోసం కాదనీ, ప్రజల భవిష్యత్తు కోసమేనని చంద్రబాబు నాయుడు చెప్పారు. నరేంద్ర మోడీ తనకంటే సీనియరేం కాదనీ, ఆయనకో అవకాశం వచ్చిందీ, మనం కూడా సహకరిద్దాం, దేశాన్ని అభివృద్ధి చేయడంలో అన్ని విధాలుగా ముందుకుపోదాం, విభజన అనంతరం మనకు కూడా న్యాయం చేసే దిశగా కృషి చేద్దామని ఆలోచించానని చంద్రబాబు చెప్పారు. కానీ, నమ్మక ద్రోహం చేశారన్నారు. వెంకటేశ్వర స్వామి సాక్షిగా అన్నీ ఇస్తామని నమ్మబలికి, ఏమీ చెయ్యలేదన్నారు. భాజపాతో పొత్తు పెట్టుకున్నా, ఎన్డీయేలో కలిసినా సరే.. మరోపక్క సొంతంగా కష్టపడి పనిచేస్తూనే ఉన్నామన్నారు.
ఎన్డీయేతో పొత్తు పెట్టుకోవడానికి ఉన్న కారణాలను ఈ మధ్య పదేపదే సీఎం చెబుతూ ఉన్నారు! భాజపాతో కలిసింది అధికారం కోసం కాదనీ, రాష్ట్ర ప్రయోజనాల కోసమే అనే అంశాన్ని ప్రతీ సభలోనూ చంద్రబాబు ప్రస్థావిస్తున్నారు. ఇలా తరచూ ఈ అంశాన్ని ప్రస్థావించడం వెనక ఓ వ్యూహం ఉందనే అభిప్రాయం కలుగుతోంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయేతో టీడీపీ పొత్తు ఉండదు. కానీ, కేంద్రంలో భాజపాయేతర రాజకీయ కూటమిలో టీడీపీ కలవాల్సిన అవసరం చాలా స్పష్టంగా ఉంది. ఆ దిశగా టీడీపీ చేస్తున్న ప్రయత్నాలూ ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే. కాబట్టి, సమీప భవిష్యత్తులో జాతీయ స్థాయి రాజకీయాలకు సంబంధించి టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా… దాన్ని కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోణం నుంచి చూడాలే తప్ప, కేంద్రంలో చక్రం తిప్పేద్దామన్న ఉద్దేశంతో టీడీపీ వ్యవహరిస్తోందన్న అభిప్రాయం కలిగించే విధంగా ఉండకూడదు.
టీడీపీ పొత్తుల నిర్ణయాలను ఇతర రాజకీయ పార్టీలు సహజంగానే విమర్శించినా… అప్పటికే ప్రజలను ఆలోచింపజేసే విధంగా ప్రిపేర్ చేయడమే ఇప్పుడు చంద్రబాబు వ్యాఖ్యల వెనక ఉద్దేశంగా కనిపిస్తోంది. నాడు భాజపాకి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితిని పదేపదే వివరించడం ద్వారా… ఎల్లప్పుడూ అదే పార్టీకి మద్దతు ఇచ్చి తీరాలన్న రూలేం ఉండదనే అభిప్రాయాన్నీ కలిగించే ప్రయత్నంగానూ చెప్పుకోవచ్చు.