కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ సర్కారు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీలో దీన్ని ఆమోదించారు కూడా! కాపుల రిజర్వేషన్ల అంశమై ప్రతిపక్షం చేస్తున్న విమర్శలకి ఈ నిర్ణయంతో చెక్ పెట్టారు. అంతేకాదు, ఉద్యమాల పేరుతో ఎప్పటికప్పుడు ఆంధోళనకు దిగేందుకు సిద్ధమయ్యే వారికి కూడా ఈ నిర్ణయంతో చెక్ పడ్డట్టే! రాజకీయంగా చూసుకుంటే ఈ నిర్ణయం టీడీపీకి ఎన్నికల్లో బాగా మైలేజ్ ఇచ్చే అంశం. మరి, ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నాక కూడా టీడీపీ కాపు నేతలు ఎందుకు సంబరాలు చేయడం లేదు..? రిజర్వేషన్ల నిర్ణయం ప్రకటించిన రోజు మాత్రమే ముఖ్యమంత్రికి పాదాభివందనాలు చేసి, స్వీట్లు తినిపించడం వరకే నేతలు ఎందుకు పరిమితమయ్యారు..? సాధారణంగా అయితే ఈపాటికే కాపు నేతలు భారీ సభలూ ర్యాలీలు చేసెయ్యాలి. ముఖ్యమంత్రికి సన్మానాలు అంటూ హడావుడి ఉండాలి. కానీ, ఇందుకు విరుద్ధంగా ఎందుకు సైలెంట్ గా ఉన్నారు..? ఈ మౌనం వెనక కూడా రాజకీయ కోణం ఉందని చెప్పుకోవచ్చు..!
కాపు రిజర్వేషన్లు ప్రకటించిన వెంటనే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ భారీ ఎత్తున సంబరాలు చేసేందుకు కొంతమంది టీడీపీ కాపు నేతలు సిద్ధమయ్యారు. ప్రభుత్వ పెద్దలకు భారీ ఎత్తున సన్మాన కార్యక్రమాలు కూడా చేద్దామనుకున్నారు. అయితే, ఈ విషయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలియగానే వారించారట! లేనిపోని ఆర్భాటాలకు వెళ్లొద్దని నేతలకు చెప్పారట. దీంతో ఆ కార్యక్రమాలన్నీ ఆగిపోయాయి. ఇంతకీ.. సంబరాలను వద్దనడం వెనక చంద్రబాబు వ్యూహం ఏంటనేగా మీ సందేహం! రిజర్వేషన్ల అంశం కాపులకు ఆనందాన్నిచ్చే నిర్ణయమే. అయితే, ఈ రిజర్వేషన్లను బీసీలు మొదట్నుంచీ కొంత వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. బీసీలకు ఎలాంటి అన్యాయం జరక్కుండానే కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని చంద్రబాబు చెబుతున్నా, ఈ తరుణంలో కాపుల సంబరాలకు ఆయన హాజరైతే బీసీల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది కదా!
సంప్రదాయంగా బీసీలు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తుంటారు. వారు కూడా టీడీపీకి కీలకమైన ఓటు బ్యాంకు. కాబట్టి, హంగామాలూ ఆర్భాటాలకు వెళ్లే బీసీలు నొచ్చుకునే అవకాశం ఉంటుందనేది చంద్రబాబు ఆలోచన. ఇంకోటి.. రిజర్వేషన్లపై రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకున్న మాత్రాన సరిపోదు కదా. బిల్లు ఆమోదించి కేంద్రానికి నివేదించారు. దీనిపై పార్లమెంటు కూడా ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. అసెంబ్లీలో ఆమోదించిన రిజర్వేషన్లు కార్యరూపం దాల్చాలంటే ఇంకా కొంత సమయం పడుతుంది. ఈలోగా సంబరాలు చేసుకుంటే… ఇప్పటికే భాజపాతో టీడీపీ టెర్మ్స్ సరిగా లేని పరిస్థితి, ఈ నిర్ణయంపై ఎక్కడైనా ఏదైనా ఆలస్యం జరిగితే అభాసుపాలు కావాల్సి వస్తుంది. ప్రతిపక్ష పార్టీకి మరో బలమైన విమర్శనాస్త్రం అందించినట్టు అవుతుంది. అందుకే, కాపుల రిజర్వేషన్ల వంటి కీలకమైన నిర్ణయం తీసుకున్నా టీడీపీ నేతలు సంబరాలు చేసుకోవడం లేదని చెప్పొచ్చు. అయితే, కొంతమంది కాపు నేతల వాదన మరోలా ఉందని సమాచారం. కాపుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న నియోజక వర్గాల్లోనైనా సంబరాలు చేసుకోకపోతే ఎలా అని వారు పట్టుబడుతున్నారట. కాపు ఓటర్లు అధికంగా ఉన్న చోట్ల కూడా ఈ సందర్భాన్ని వినియోగించుకోకపోతే ఆ సామాజిక వర్గంలోకి వేరే సంకేతాలు వెళ్తాయనేది వారి అభిప్రాయం. ఏదేమైనా, చంద్రబాబు వద్దన్నారు కాబట్టి, కాపుల రిజర్వేషన్లను టీడీపీ ఇప్పట్లో సెలబ్రేట్ చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు.