కేవలం కొన్ని నిర్మాణాలు, కొన్ని సంక్షేమ పథకాలు మాత్రమే కాదు. చివరికి కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ వంటి పరిపాలన పరమైన, రాజకీయ పరమైన నిర్ణయాలను కూడా అటు చంద్రబాబు సంకల్పిస్తూ ఉన్న సమయంలోనే ఇటు కేసీఆర్ ఆచరణలో పెట్టేసే పరిస్థితి కనిపిస్తోంది. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా దేశంలో అతిపెద్ద 125 అడుగుల విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటుచేస్తాం అని గతంలో చంద్రబాబు చెప్పారు. అది ఎప్పటికి అవుతుందో తెలియదు గానీ.. కేసీఆర్ ఈ ఏడాది 14వ తేదీనే ప్రపంచంలోనే అతిపెద్ద 125 అడుగుల విగ్రహానికి శంకుస్థాపన చేయబోతున్నారు. వచ్చే ఏడాది జయంతి నాడు దాని ఆవిష్కరణ కూడా ఉంటుదని ఆయన చాలా ఘనంగా చెప్పేశారు.
అదే క్రమంలో రాజకీయంగానూ చంద్రబాబునాయుడు అక్కడ ఏపీలో మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ గురించి కసరత్తు చేస్తున్నారనే వార్తలు వస్తుండగానే.. ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకంగా గవర్నర్‌తో భేటీకి కూడా అపాయింట్మెంట్ తీసేసుకున్నారు. కేబినెట్ మార్పుచేర్పుల గురించి గవర్నర్‌తో మర్యాదపూర్వకంగా సమాచారం ఇవ్వడానికి ఇవాళ కలవబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని రోజుల వ్యవధిలోనే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని, దీనికి సంబంధించి కసరత్తు పూర్తిస్థాయిలో పూర్తయిందని అంతా అనుకుంటున్నారు.
తెలంగాణ సర్కారులో ఎందరు మంత్రులు ఉండగలరో అన్నీ స్థానాలూ భర్తీగానే ప్రస్తుతం ఉన్నాయి. ఏ ఒక్కరికి చోటు కల్పించాలన్నా మరొకరి మీద వేటు పడాల్సిందే. ప్రస్తుతం మంత్రి పదవి హామీ పొందిఉన్న వారు కేసీఆర్ నిర్ణయం కోసం నిరీక్షిస్తూ చాలా మందే ఉన్నారు. కొప్పుల ఈశ్వర్‌కు కేబినెట్ గేరంటీ అని కేసీఆర్ ఇటీవల కూడా ప్రకటించారు. అలాగే మహిళల్లో కనీసం ఒకరిద్దరికైనా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. ఇంకా కొత్తగా తనను నమ్ముకుని తెదేపానుంచి వచ్చిన ఎందరికి బెర్తులు ఇస్తారో తెలియదు. ఇలా కొత్తగా ఎందరికి అవకాశం దక్కితే ఆ దామాషాలో ప్రస్తుతం ఉన్న కేబినెట్ సహచరుల మీద వేటు పడాల్సిందే! వేరే గత్యంతరం లేదు.
అందుకే కేసీఆర్ కేబినెట్లోని మంత్రులు చాలా మంది ఈ విస్తరణ గురించి గుబులుగా గడుపుతున్నారు. అదే సమయంలో మహిళా ఎమ్మెల్యేల్లో కొందరిలో మాత్రం కొత్త ఆశలు చిగుళ్లు తొడుగుతున్నాయి. కేబినెట్లో ఒకరికి కూడా చోటివ్వకుండా మహిళా వ్యతిరేకిగా ముద్రపడ్డ కేసీఆర్, ఇటీవల అనేక మహిళల అనుకూల నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా కనీసం ఇద్దరికైనా కేబినెట్లో చోటు ఇస్తారనే ప్రచారం జరుగుతున్నది. ఈ సస్పెన్స్‌కు ఆయన ఎప్పటికి తెరదించుతారో చూడాలి.