ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నూతన భవన ప్రారంభానికి ప్రతిపక్ష నేత జగన్ వస్తారా లేదా అని రెండు రోజుల కిందట ఒక ఛానల్లో చర్చ జరిగింది.అమరావతి శంకుస్థాపనకు పిలిచినా రాలేదు గనక ఇప్పుడు మాత్రం ఏమొస్తారని తెలుగుదేశం తరపున వచ్చిన జూపూడి ప్రభాకరరావు వ్యాఖ్యానించారు. అప్పుడు రాలేదని జీవితంలో మరే ఉత్సవానికి పిలవమంటే ఎలా అని నేను వాదించాను. వైసీపీ ప్రతినిధి అక్కడి సమస్యలు చెప్పారు. చాలా సమస్యలు సంఘర్షణలు వున్నా చారిత్రాత్మక సందర్భం గనక ప్రతిపక్ష నేత వెళ్లడం సమంజసంగా వుండేది. మరి ఆయనను సక్రమంగా పిలిచారా లేదా తెలియదు. సంబంధిత మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పిన దాంట్లో అందరినీ పిలిచామని చెప్పడం తప్ప నిర్దిష్టంగా చెప్పలేదు. వైసీపీ వారి ఫిర్యాదులు కొన్ని వుండనే వున్నాయి.అసలు సభలో తమ నేతకు సరైన ఛేంబర్ లేదని వారంటున్నారు. నెమ్మదిగా అవన్నీ తెలుస్తాయి. ఏమైనా కీలకమైన సందర్భాల్లో ప్రతిపక్ష నేత వుండకపోవడం లోటుగానే భావించాల్సి వుంటుంది. ఢిల్లీలో ఎంతగా పోట్టాడుకునే పార్టీలైనా అధికారిక వేడుకలు ఉత్సవాల్లో తప్పక కలసి కనిపిస్తుంటారు. అమరావతి మరింత ప్రత్యేక చారిత్రిక సందర్భం. ఇలాటి సమయంలో ప్రతిపక్ష నేత కనిపించకపోవడం వల్ల ప్రభుత్వానికే మేలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చుట్టూనే ప్రసంగాలూ చేసుకోవడం ఇంకా సులభం.
ప్రభుత్వంలో ఎవరున్నా ప్రజలందరికీ రాష్ట్రమంతటికీ సంబందించిన విషయాల్లో ఎలా పాల్గొనాలన్నది వైసీపీ ఆలోచించుకోవడం మంచిది. రాకుంటేనే మంచిదనే భావన నుంచి పాలక పక్షం కూడా బయిటపడాలి. జరిగేదంతా తమ ఘనతే అనుకోవడం బాగానే వుండొచ్చు గాని రేపు సమస్యలు కూడా వారొక్కరే మోయవలసి వుంటుంది. ఒక్క అఖిలపక్ష చర్చ గాని సంప్రదింపులు గాని లేకుండా కర్త కర్మ క్రియ ఒక్కరే అన్నట్టు చేస్తే కష్టనష్టాలకూ పూర్తి బాధ్యత వహించాల్సి వుంటుంది. ప్రజాగ్రహం వచ్చినప్పుడు ఆ ప్రభావం కనిపిస్తుంది. అవన్నీ అలా వుంచి సుహృద్భావం పెంచేందుకు అనుభవజ్ఞుడైన చంద్రబాబు ఒక అడుగు వేయడం వల్ల నష్టమేమీ లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ విషయంలో చూపిన చొరవ స్వరాష్ట్రంలో ఎందుకు చూపరు? కెసిఆర్‌తో స్నేహగీతం, పాలించే రాష్ట్రంలో ఏకపక్షం ఏ విధంగా సమంజసం? ఆ పెద్దరికం ఇక్కడా వుంటే బాగుంటుంది.