వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి మీడియా సమావేశంలో చెప్పేశారు. అతి విశ్వాసమో లేక అందరిలో అదే కలిగించాలన్న తాపత్రయమో గాని రోజుకోసారి ఆ మాట చెప్పకుండా ఆయన వుండలేకపోతున్నారు. ప్రజల కోసం పనిచేస్తున్నాం గనక వచ్చేస్తామంటారు. మళ్లీ ఆయనే ప్రజల్లో సంతృప్తి స్థాయి 58 శాతం వుందని లెక్కలు చెబుతారు. పదేళ్లు ప్రతిపక్షంలో వున్నామని ఆ తప్పు మళ్లీ జరగకూడదంటే కలెక్టర్లే పరీక్షలు పాస్ చేయించాలని బాహాటంగా అడుగుతారు. కేంద్రం సహాయాన్ని ప్యాకేజీని కీర్తిస్తూ శాసనసభలో తీర్మానాలు చేసిన ముఖ్యమంత్రి ఇప్పుడు మీరే వెళ్లి ఢిల్లీలో నిధులు తెచ్చుకోవాలని పురమాయిస్తారు. ఇదంతా చూస్తుంటే కొంత తికమక.. మరికొంత మకతిక అనిపిస్తుంది. కలెక్టర్ల సమావేశంలో ఆయన ఆగ్రహిస్తే విద్యాధికారులపై మంత్రి గంటా ఆగ్రహిస్తే మునిసిపల్ కమిషనర్లపై మంత్రి నారాయణ ఆగ్రహిస్తే ఎంపి జెసి స్థానిక పరిస్తితులపై ఆగ్రహిస్తే మళ్లీ ఆయనపై ముఖ్యమంత్రి ఆగ్రహిస్తే ఇదంతా ఒక ప్రహసనంగా మారింది. సదావర్తి భూముల వంటి చిన్న విషయంలోనూ పరిపరివిధాల మాట్లాడి చివరకు హైకోర్టులోఅక్షింతలు వేయించుకుని రెండవ పాటదారునికి భూములు అప్పగించాల్సి రావడం ప్రభుత్వానికి వన్నె తెచ్చే విషయం కాదు. ముఖ్యమంత్రి బాగాలేవన్న నార్మన్ పోస్టర్స్ డిజైన్స్‌ను ఆయన పిలిపించిన రాజమౌళి ఫస్టుక్లాస్గా వున్నాయని చెప్పడం కూడా అలాటిదే. ఇంత తబ్బిబ్బూ విశ్వాసాన్ని సూచిస్తుందా లేక హడావుడిని తెలియజేస్తుందా ఎవరైనా చెప్పొచ్చు. సంయమనం కావాలి మరి!