ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు క్లాస్ తీసుకున్నారు, ఆగ్రహించారు, పనితీరు సమీక్షించారు, మందలించారు.. కనీసం నెలకోసారైనా ఇలాంటి వార్త తెరమీదికి వస్తుంది. ఇప్పుడు కూడా మంత్రులూ ఎమ్మెల్యేల పనితీరును ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి సమీక్షించారు! పార్టీ, ప్రభుత్వం సమన్వయ సమావేశంలో మంత్రులనూ పార్టీ జిల్లాల ఇన్ ఛార్జ్ గా వ్యవహరిస్తున్న పార్టీ నేతలను ఉద్దేశించి సున్నితంగా మందలించారని చెప్పొచ్చు. ఇన్ ఛార్జ్ మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నవారు అప్రమత్తంగా ఉండాలన్నారు. నియోజక వర్గాలకి వెళ్లాలనీ , మరింత చురుగ్గా పనిచేయాలని సీఎం క్లాస్ తీసుకున్నారు. ముఖ్యంగా పయ్యావుల కేశవ్, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడుని ఉద్దేశించి ఆయన మాట్లాడారని అంటున్నారు. ఇక, మంత్రుల పనితీరు విషయంలో కూడా సీఎం కొంత అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. మహిళా మంత్రులు పరిటాల సునీత, భూమా అఖిల ప్రియలకు కూడా సున్నితంగా క్లాస్ తీసుకున్నారట.
వచ్చే ఎన్నికల్లో ఎలాంటి నేతలకు సీట్లు ఇస్తారనేది కూడా సీఎం సంకేతాలు ఇచ్చారు. ఎమ్మెల్యేలూ నాయకుల పనితీరుపై వారు ఇస్తున్న నివేదికలపైనే తాను ఆధారపడటం లేదనీ, ఇతర మార్గాల ద్వారా కూడా సమాచారం తెప్పించుకుంటున్నానని ముఖ్యమంత్రి చెప్పారు. అంటే, అందరిపైనా బిగ్ బాస్ కన్ను ఉందన్నమాట! ఇకపై రాజకీయ అంశాల్లో ఒక్క శాతం కూడా తాను మొహమాటానికి పోననీ, పదవులు తీసుకున్నవారు ఇంట్లో కూర్చుంటే కుదరదనీ సీఎం అన్నారు. ఎమ్మెల్యేలూ ఎంపీలూ తాము బాగా కష్టపడుతున్నాం అనుకుంటే సరిపోదనీ, ప్రజల్లోకి వెళ్లాలనీ అందరినీ కలుపుకుంటూ రాజకీయ పునరేకీకరణకు పాటుపడాలన్నారు. నాయకుల గురించి ప్రజలేమనుకుంటారూ, వారు సంతృప్తిగా ఉన్నారా లేదా అనేదే ప్రాతిపదికగా తీసుకుని, గెలిచేవారికే టిక్కెట్లు వస్తాయని చంద్రబాబు చెప్పారు. ముఖ్యమంత్రి చాలా కష్టపడుతున్నారుగానీ, ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని తన దగ్గరకు వస్తున్నవారు అభిప్రాయపడుతున్నారని చంద్రబాబు చెప్పడం విశేషం!
ముఖ్యమంత్రి క్లాస్ అనగానే.. ప్రతీసారీ ఇవే అంశాలు ఉంటున్నాయి. తాను కష్టపడుతున్నానని చెప్పుకుంటూనే, అదే స్థాయిలో నేతలు కష్టపడటం లేదనే అసంతృప్తిని చంద్రబాబు వ్యక్తం చేస్తుంటారు. గెలిచేవారికే టిక్కెట్లు అని ప్రతీసారీ చెప్తున్నమాటే. గత కొన్నాళ్లుగా చంద్రబాబు ఇదే తరహా క్లాస్ వేస్తున్నారంటే… ఆయన ఆశించిన మార్పు పార్టీలో కనిపించడం లేదా..? ఆయన వేసిన క్లాసులు పనిచేయడం లేదా..? నిజానికి, నలభై నియోజక వర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి ఉందనే కథనాలు ఆ మధ్య వచ్చాయి. వారికి ప్రత్యేకంగా సీఎం క్లాసు తీసుకోవడం జరిగింది. వారి పనితీరు పర్యవేక్షించే బాధ్యతను మంత్రి యనమల రామకృష్ణుడికి అప్పగించారు. మరి, వారు మారారా లేదా అనేది ఇప్పుడు చర్చించినట్టు లేదు! మొత్తానికి, పార్టీ నేతలతో ఇలాంటి సమన్వయ సమావేశం నిర్వహించిన ప్రతీసారీ ముఖ్యమంత్రి కొంత ఆవేదనతో ఉన్నట్టు కనిపిస్తారు. నేతల పనితీరుపై ఆయనకి ఉన్నది అసంతృప్తా, అభద్రతా భావమా, లేదా… అంతా బాగున్నా అప్రమత్తంగా ఉండాలన్న దూరదృష్టా..?