అక్కడే ఉన్న వారు రోడ్ల కష్టాలకు అలవాటుపడిపోయి ఉంటారు. రోడ్లు బాగు చేస్తే వారంలో మర్చిపోతారు. కానీ వేరే ఊరిలో ఉండి.. వచ్చే వారికి మాత్రం మార్పు ఒక్క సారిగా కనిపిస్తుంది. ఈ సారి ఆంధ్రాకు వెళ్లే వారికి ఇలాంటి మార్పులు చాలా కనిపించబోతున్నాయి. రోజూ మనం చూసే చెట్టు పెరుగుతూంటే పెద్దగా ఏమీ అనిపించలేదు. కానీ విత్తినప్పుడు చూసిన వారు.. మళ్లీ పెరిగిన తర్వాత చూస్తే అప్పుడే ఇంత అయిపోయిందా అనుకుంటాం. ఈ సారి ఏపీకి వెళ్లేవాళ్లు.. రోడ్ల కష్టాలు లేకుండా వచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
ప్రతి ఎమ్మెల్యేకు చంద్రబాబునాయుడు టార్గెట్ పెట్టారు. ఎక్కడా రోడ్లపై గుంతలు లేకుండా చూడాల్సిందేనని స్పష్టం చేశారు. వారిని ఏదో డబ్బులు పెట్టుకుని గుంతలు పూడ్చమని చంద్రబాబు చెప్పడం లేదు. పర్యవేక్షణ మాత్రమే చేయమంటున్నారు. ఎక్కడెక్కడ రోడ్లు దారుణంగా ఉన్నాయో గుర్తించి వెంటనే రిపేర్లు చేయించాలని చెబుతున్నారు . ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పనులు జరుగుతున్నాయి. గుంతలను పూడ్చేస్తున్నారు. సిమెంట్ రోడ్ల నిర్మాణం జరుగుతోంది. ఈ మార్పులు.. ఊళ్లకు వచ్చే వారికి తెలియాలని చంద్రబాబు అంటున్నారు.
ఎవరైనా రోడ్లు బాగున్నాయని పొగడకపోయినా పర్వాలేదు కానీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయినా బాగు చేయలేదన్న అపవాదు మాత్రం రాకూడదని చంద్రబాబు అంటున్నారు. అలాంటి ఫిర్యాదులు వస్తే మాత్రం ఎమ్మెల్యేలనే బాధ్యులను చేస్తానని ఆయన వార్నింగ్ ఇచ్చారు. గుంతు పూడ్చడానికి గ్రామాల్లో కొత్త రోడ్లు వేయడానికి ఎలాంటి నిధుల సమస్య లేదు. పనులు వేగంగా సాగుతున్నాయి. కానీ ఎమ్మెల్యేల నిర్లక్ష్యం మాత్రం ఉండకూడదని చంద్రబాబు కోరుకుంటున్నారు.