ఏపీ ఫస్ట్ అనే నినాదాన్ని చంద్రబాబు పరిపాలనలో ఇచ్చారు. రాజకీయాల్లో కార్యకర్తలే ఫస్ట్ అనే నినాదాన్ని తీసుకుని వెళ్తున్నారు. ఏ నియోజకవర్గ పర్యటనకు వెళ్లినా అక్కడ పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. క్రియాశీల కార్యకర్తలతో మమేకం అవుతున్నారు. పార్టీ కోసం పని చేసే వారికి గుర్తింపు ఉంటుందని చెబుతున్నారు. లాలూచీ రాజకీయాలు చేసేవారిని దగ్గరకు రానివ్వబోనని హెచ్చరిస్తున్నారు. గతంలో అధికారిక పర్యటనలకు వెళ్తే చంద్రబాబు ఆ పని చేసుకుని వచ్చే వారు. ఇప్పుడు పార్టీ కోసం సమయం కేటాయిస్తున్నారు.
పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశాలు
అధికారిక విధులలో భాగంగా చంద్రబాబు రాష్ట్రమంతా పర్యటిస్తూ ఉంటారు. గతంలో అయితే ఆయన హడావుడిగా వెళ్లి కార్యక్రమాల్లో పాల్గొని.. అ?ధికారులతో సమీక్షలు నిర్వహించి తిరుగుపయనం అయ్యేవారు. అతి కష్టం మీద పార్టీ నేతలు హెలిప్యాడ్ వద్దనో.. లేకపోతే అతిథిగృహం వద్దో.. ఓ పావు గంట మాట్లాడే చాన్స్ వచ్చేది. కానీ ఇప్పుడు చంద్రబాబు తన పాలసీ మార్చుకున్నారు. పార్టీ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్నారు. కార్యకర్తలతో భేటీ అవుతున్నారు. కార్యకర్తలతో నేరుగా మాట్లాడుతున్నారు. గ్యాప్ లేకుండా చూసుకుంటున్నారు.
గతంలో అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి సమయం తక్కువ కేటాయింపు
చంద్రబాబు అధికారంలో ఉంటే పూర్తిగా పాలనపై దృష్టి పెడతారు. పార్టీ కోసం కేటాయించే సమయం తక్కువ. ఆ కంప్లైంట్లు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ సారి మాత్రం అలాంటి ఫిర్యాదులకు అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. అందుకే కార్యకర్తలతో సమావేశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. తన వద్ద అంతా సమాచారం ఉందని.. ఎన్డీఏ కార్యకర్తలకే పనులు చేయాలని స్పష్టం చేశారు. ఇతర పార్టీలతో లాలూచీ రాజకీయాలు వద్దని చెబుతున్నారు.
కార్యకర్తలకు అందుబాటులో నారా లోకేష్
మరో వైపు కార్యకర్తలకు అందుబాటులో నారా లోకేష్ ఉంటున్నారు. ఎలాంటి సమస్య వచ్చినా సంప్రదించే ఓ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పార్టీలో నిర్మించిన వ్యవస్థల ద్వారా .. పార్టీ కార్యకర్తలకు నిరంతరం టచ్ లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఎప్పుడూ సమస్యగా మారే పార్టీ క్యాడర్ – లీడర్ మధ్య గ్యాప్ ఈ సారి రాదని..రాకుండా చూసుకోవాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.