ఐదు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల ఫలితాలకు ముందు బీజేపీయతర పార్టీలన్నీ.. ఐక్యతను ప్రదర్శించాయి. టీడీపీ అధినేత చంద్రబాబు కోఆర్డినేట్ చేయడంతో.. నాగాలాండ్ కు చెందిన నాగా పీపుల్స్ ఫ్రంట్ నుంచి.. తమిళనాడులోని డీఎంకే వరకూ… బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. 20 పార్టీలు సమావేశానికి హాజరయ్యాయి. యూపీఏ చైర్ పర్సన్ హోదాలో… సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని హోదాలో రాహుల్ గాంధీ సహా ఇతర పార్టీల నేతంలదరూ హాజరయ్యారు. సమావేశానికి ముందు చంద్రబాబు.. మమతా బెనర్జీ, ఫరూక్ అబ్దుల్లా, అహ్మద్ పటేల్ లతో చర్చలు జరిపారు. భారతీయ జనతా పార్టీని కలసి కట్టుగా ఎలా ఢీకొట్టాలన్న అంశంపై.. సమావేశంలో ప్రధానంగా చర్చించారు. మంగళవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చించారు. రాఫెల్ స్కాం, వ్యవస్థల విధ్వంసం విషయంలో… మంగళవారం రాష్ట్రపతికిని కలసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. బీజేపీని ఓడించేందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించామని రాహుల్ గాంధీ ప్రకటించారు.
సమావేశం దాదాపుగా రెండు గంటల సేపు జరిగింది. భవిష్యత్ లో కూటమిని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంపై చర్చలు జరిపారు. కూటమిలోని ప్రాంతీయ పార్టీలు .. తమ తమ రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా భారీ ర్యాలీలను నిర్వహించాలనుకుంటున్నాయి. వాటిపైనా చర్చించారు. జనవరిలో మమతా బెనర్జీ కోల్ కతాలో నిర్వహించనున్న ర్యాలీకి అన్ని పార్టీల నేతలు హాజరు కానున్నారు. అలాగే.. కర్ణాటక జేడీఎస్ రైతు ర్యాలీ, అమరావతిలో టీడీపీ ధర్మపోరాట దీక్షలను కూడా జాతీయ నేతలందర్నీ పిలిచి నిర్వహించాలనుకుంటున్నారు. వీటిపైనా సమావేశంలో చర్చించారు. పార్లమెంట్ లోపల, బయట చేపట్టే ఆందోళనలపై చర్చించామని చంద్రబాబు చెప్పారు. పధ్నాలుగు పార్టీలు వస్తాయని చంద్రబాబు అనుకున్నారు కానీ.. ఆ సంఖ్య ఇరవైకి చేరుకుంది. చంద్రబాబు ఈ సమావేశం పెట్టినప్పుడే… బీహార్ కు చెందిన ఎన్డీఏ పార్టీ.. రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ బయటకు వచ్చింది.
కూటమి సమావేశానికి ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రధాన పార్టీలయిన సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు హాజరు కాలేదు. ఈ రెండు పార్టీలకు.. కాంగ్రెస్ పార్టీ పెద్దన్నగా వ్యవహరించడం ఇష్టం లేదు. యూపీలో కాంగ్రెస్ పుంజుకుంటుందేమోనని వీరి ఆందోళన. లోక్ సభ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని పోటీ చేశాయి. వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి సిద్దంగానే ఉన్నాయి. అయితే.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్ లలో జరిగిన ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ తో పొసగలేదు. దాంతో.. కాంగ్రెస్ పై ఎన్నికల ప్రచారంలో తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు గత ఢిల్లీ పర్యటనలో.. అఖిలేష్ ను, మాయావతిని కలిశారు. బీజేపీయేతర కూటమిలో పని చేయడానికి వారు ఆసక్తి చూపించారు. కానీ.. కాంగ్రెస్ పెత్తనం మాత్రమే వారు అంగీకరించలేదు.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి విజయాలు సాధిస్తే.. ఈ రెండు పార్టీలు కూడా.. తదుపరి జరిగే సమావేశానికి వస్తాయని … భావిస్తున్నారు.