వ్యాసకర్త: యార్లగడ్డ వెంకట్రావు [ ప్రభుత్వ విప్ & గన్నవరం శాసన సభ్యులు ]
నేను చంద్రబాబు గారిని మొదటిసారి కలిసినప్పుడు ఆయన నాతో ఏం అన్నారు అంటే—“గ్లోబలైజేషన్ వల్ల అన్ని రాష్ట్రాలు అభివృద్ధి దిశగా వెళ్తుంటే, మన రాష్ట్రం మాత్రం వెనుకబడిపోతోంది. ఈ రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టాలి అంటే కష్టపడి కలిసి పని చేయాలి” అని చెప్పారు. ఆయన విజన్ మరియు ఆయిడియాలజీ చూసి, ఆయనతో కలిసి ప్రయాణించాలని నేను నిర్ణయించుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా అవమానం ఎదుర్కొన్నప్పుడు, గన్నవరం ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ఆ అవమానానికి సమాధానం ఇచ్చింది. ఆయన చేసిన భీషణ ప్రతిజ్ఞ నెరవేర్చుతూ, గన్నవరం లోనే జూన్ 12న ఆయన ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. ఇది యాదృచ్ఛికం కాదు, కాకతాళీయత కూడా కాదు.
చంద్రబాబు గారి బాధ, కన్నీటికి నా విజయం ద్వారా గన్నవరం ప్రజలు సమాధానం చెప్పారు—37,628 ఓట్ల మెజారిటీతో. గన్నవరం నియోజకవర్గంలో 1983 నుంచి ఇప్పటివరకు ఇంత పెద్ద మెజారిటీ ఎప్పుడూ రాలేదు. ఆయన చూడని పదవి లేదు, ఆయన చేయని పరిపాలన లేదు. నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు, క్రైసిస్ మేనేజ్మెంట్లో దేశానికే ఉత్తమ సీఎంగా నిలిచారు.
1996 గోదావరి వరదలు— 46 ఏళ్ల వయసులో క్రైసిస్ మానేజ్మెంట్ కి పునాది
1996 నవంబరులో జరిగిన భారీ తుఫాను కోనసీమ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా నిలిచిపోయింది. పెరుగుతున్న తుఫాను ప్రమాదాన్ని ముందే గుర్తించి, 225,000 కుటుంబాలను ఖాళీ చేయించారు. ఈ తుఫాను కారణంగా 1,077 మంది మరణించారు. 2.33 లక్షల కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. 78 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చంద్రబాబు నాయుడు గారు ఈ విపత్తును ఎదుర్కొనడంలో తన దక్షతను ప్రదర్శించారు. రాజమండ్రిలో మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షించారు. ఆ తర్వాత ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టారు.
2014 హుద్‌హుద్ తుఫాను— 64 ఏళ్ల వయసులో కమాండ్ కంట్రోల్ లీడర్షిప్
2014 అక్టోబరులో హుద్‌హుద్ తుఫాను కారణంగా దాదాపు ₹21,908 కోట్ల నష్టం జరిగింది. విశాఖపట్నంలో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసి సహాయ కార్యక్రమాలను నడిపించారు. 5 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నా, NDRF, ఇతర ఏజెన్సీలతో కలసి సహాయక చర్యలు చేపట్టారు. ఆయన జవాబుదారీతనం విశాఖ ప్రజలకు నూతన ఆశలు కలిగించింది.
2024 విజయవాడ వరదలు— 75 ఏళ్ల వయసులో క్రైసిస్ మేనేజ్మెంట్లో శక్తి ప్రదర్శన
120 రోజుల క్రితం విజయవాడలో వరదలు వచ్చినప్పుడు, చంద్రబాబు గారు 75 ఏళ్ల వయసులో కూడా సమర్థంగా స్పందించారు. బుడమేరు గండ్లు పూడ్చడంలో వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. రాత్రి 10 గంటల వరకు, కాలనీల్లో 4-5 అడుగుల వరదనీరు చేరినప్పుడు కూడా రెస్క్యూ కార్యకలాపాలను పర్యవేక్షించారు. NDRF సిబ్బందిని సమన్వయం చేసి, ట్రాక్టర్లు, బోట్లను ఉపయోగించి ప్రజలను రక్షించారు. అమిత్ షా గారిని సంప్రదించి పంజాబ్ నుంచి బోట్లను ఎయిర్‌లిఫ్ట్ చేయించటం ప్రత్యేకత.
సీఎం గారు మరియు మేము తెల్లవారుజామున 4:15 వరకు పనిచేశాం. ఉదయం 6:30కి మళ్లీ సమావేశమయ్యాం. వరదల సమయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి, బట్టలు, కాండిల్స్, ఆహారం, నీరు, మెడిసిన్లు పంపిణీ చేసింది. పశువులకు కూడా దాణా అందించడంలో సీఎం గారి ప్రత్యేక శ్రద్ధ కనిపించింది. 15 లక్షల ఫుడ్ పాకెట్స్, 30 లక్షల వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. తొలిసారిగా డ్రోన్లను ఆహారం పంపిణీకి ఉపయోగించడంతో పాటు, హెలికాప్టర్ల ద్వారా సహాయం అందించడం విశేషం. మున్సిపల్ సిబ్బందిని రాష్ట్రం మొత్తం విజయవాడకు తిప్పించి క్లీన్ చేయించడం, ఫైర్ ఇంజిన్లు తెప్పించి రోడ్లు, ఇళ్లను శుభ్రం చేయించడం ప్రజల్లో ధైర్యాన్ని పెంచింది.
వరద ప్రభావితుల కోసం ప్రభుత్వం రూ.173.69 కోట్లు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఇళ్లకు రూ.25 వేలు, ఇతర ఇళ్లకు రూ.10 వేలు నష్టపరిహారం అందజేశారు. దెబ్బతిన్న వాహనాలు, పశువులు, చిన్న వ్యాపారాలు, MSMEలకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.5 లక్షల పరిహారం ఇచ్చారు. వలస కార్మికులకు కూడా నష్టపరిహారం అందించారు.
లోకేష్ బాబు గారు అధికారులతో సమన్వయం చేసి, ఆహారం, నీరు, వైద్య సహాయాన్ని నిరంతరంగా అందేలా చర్యలు చేపట్టారు. ప్రతి చిన్న సమస్యను పట్టించుకుని పరిష్కరించడంలో అభినందనీయం.
వైసీపీ ప్రభుత్వ హయాంలో, చంద్రబాబు గారి హోదా తీసివేయాలని కుట్రలు పన్నారు. అక్రమ కేసులు పెట్టి, అరెస్టులు చేసి ప్రజాస్వామ్య విలువలను దిగజార్చారు. కానీ ప్రజలు, జగన్ గారికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు.
“Experience is the greatest teacher” అనే స్వామి వివేకానంద సూక్తి చంద్రబాబు గారిపై పూర్తిగా వర్తిస్తుంది.
-యార్లగడ్డ వెంకట్రావు