ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తానిచ్చే గిఫ్ట్ అద్భుతంగా ఉంటుందని… ఆయన ఏపీలో ఘోరాతిఘోరంగా ఓడిపోతారని… కేసీఆర్ మరోసారి జోస్యం చెప్పారు. చంద్రబాబు రిలీజ్ చేస్తున్న శ్వేతపత్రాపైనా విమర్శలు చేశారు. హైకోర్టు విభజనలో కేంద్రం తప్పేమీ లేదన్నారు. హైదరాబాద్ ఐటీ అభివృద్ధిలో చంద్రబాబు పాత్రమీ లేదని తేల్చి చెప్పారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం అవసరం అయితే.. ప్రధానికి లేఖ రాస్తానని ప్రకటించారు. బీసీ రిజర్వేషన్ల వివాదంపై మాట్లాడేందుకు ప్రెస్ మీట్ పెట్టి.. చంద్రబాబును టార్గెట్ చేశారు. హైకోర్టును హడావుడిగా విభజించలేదని… డిసెంబర్ నాటికి హైకోర్టును తరలిస్తామని ఏపీ ప్రభుత్వమే చెప్పిందని.. దాని ప్రకారమే విభజించారనన్నారు. కేంద్రం తప్పేమీ లేదన్నారు. హైకోర్టు నోటిఫికేషన్ తర్వాత నెల రోజులన్నా సమయం ఇవ్వలేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేయడాన్ని చంద్రబాబు ఖండించారు. చంద్రబాబు దేశంలోనే అత్యంత డర్టీ పొలిటీషియన్ అని మండిపడ్డారు.
రెండు రాష్ట్రాలకు పారిశ్రామిక రాయిలీలు ఇవ్వాలని చట్టంలో స్పష్టంగా ఉందని కేసీఆర్ ప్రకటించారు. రెవెన్యూ లోటు భర్తీకి కేంద్రం నిధులు ఇస్తోందని కేసీఆర్ ప్రకటించారు. నిజానికి మొదటి ఏడాది లోటు భర్తీ చేయాల్సి ఉన్నా.. కేంద్రం చేయలేదని ఏపీ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మిగతా సమయాల్లో.. ఆర్థిక సంఘం నివేదిక మేరకు లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రాలకు ఇచ్చినట్లుగానే ఇస్తోంది. అయినా కేసీఆర్ కేంద్రం విభజన చట్టం మేరకు ఇస్తోందని కేంద్రాన్ని వెనకేసుకొస్తున్నారు. చంద్రబాబు పచ్చి రాజకీయ స్వార్థపరుడని… మామ పెట్టిన పార్టీని చంద్రబాబు లాక్కొన్నారని విమర్శించారు. తాను చంద్రబాబులా కాదని.. కేవలం ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చానని ప్రకటించుకున్నారు. రైతుబంధు పథకాన్ని దేశం మొత్తం ఫాలో అవుతోందని … మా పథకాలను చంద్రబాబు కాపీ కొట్టారని కేసీఆర్ ఆరోపించారు.
కల్యాణలక్ష్మి, పారిశ్రామికపాలసీని కాపీ కొట్టారని విమర్శించారు. హైదరాబాద్ ఐటీలోనూ చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. హైదరాబాద్ భౌగోళిక అనుకూలత వల్లే ఐటీ కంపెనీలొచ్చాయని … తాము కూడా నాలుగైదు పెద్ద ఐటీ కంపెనీలు తెచ్చాం .. చంద్రబాబులా మేం డబ్బా కొట్టుకోలేదన్నారు. చంద్రబాబు విడుదల చేస్తున్న శ్వేతపత్రాలపైనా విమర్శలు చేశారు. శ్వేతపత్రంలో చాలా చేశామని చంద్రబాబు చెబుతున్నారని… ఇంకో పక్క హోదా కావాలని చిప్ప చేత పట్టుకుంటారని మండిపడ్డారు. హరికృష్ణ కుమార్తెకు కూకట్ పల్లి అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వడంపైనా విమర్శలు చేశారు. శవాలపై రాజకీయం చంద్రబాబు చేశారన్నారు. మొత్తానికి కేసీఆర్ మాత్రం.. చంద్రబాబుతో తలపడేందుకే.. ఏపీలో… తన ప్రభావం చూపించేందుకు పక్కా ప్లాన్ తో వెళ్తున్నారు.