కొద్ది మాసాల కిందట ఎంఎల్ఎ జలీల్ ఖాన్ బికాంలో మ్యాథమ్యాటిక్స్ ఫిజిక్స్ గురించి మాట్లాడటంపై ఇప్పటికీ జోకులు నడుస్తున్నాయి. కాని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగ్గీ వాసుదేవ్ నడిపిన చర్చ లో కెమిస్ట్రీ జామెట్రీ ప్రధానాంశాలైనాయి. ఇటీవల మాటిమాటికీ ఆనందం అంటున్న చంద్రబాబు దానిపైనే స్వామీజీతో చర్చ పెట్టారు. మనిషికి అనందం ఎలా వస్తుందని చంద్రబాబు అడిగితే స్వామీజీ ప్రతిమనిషికీ ఒక రసాయన ప్రక్రియ(కెమిస్ట్రీ) వుంటుందని జవాబిచ్చారు.దాన్ని సక్రమంగా చూసుకోవాలట. మన సంతోషాలు విచారాలు ఆనందాలు సుఖాలూ అన్నీ ఆ రసాయన క్రియ నుంచే వస్తాయట. ఆ రసాయన క్రియ సరిగ్గా వుండేట్టు చూసుకోవాలని సలహా ఇచ్చేశారు. పైగా మనమంతా ఒక రసాయన సూప్‌లో వుంటామన్నారు.ఆ సూప్ గనక గొప్పదా చెడ్డదా అని చూసుకోవాలట.
ఇవన్నీ వింటుంటే తలతిరగడం లేదా? అయితే ఆగండి. మరి మన రసాయన క్రియ సరిగ్గా వుండాలంటే ఏం చేయాలో కూడా ఆయనే చెప్పారు. ప్రపంచంలో భౌతికమైన(ఫిజికల్) ప్రతిదీ ఒక రేఖా గణితం( జామెట్రీ ) ప్రకారం పనిచేస్తుందట. మన కెమిస్ట్రీ గనక జామెట్రీ ప్రకారం సరిగా వుంటే అంతా హాయిగా నడిచిపోతుందట. ఇది స్వామీజీ దివ్వ సందేశ సారం. ఈ కెమిస్ట్రీ ఫిజిక్స్ జామెట్రీ ఏమిటా అని జుట్టుపీక్కుంటే అది మీ తప్పే. ఈ సమయంలోనే అమరావతి నిర్మాణానికి సంబంధించి కూడా స్వామీజీ కొన్ని సూక్తులు చెప్పారు. అంతిమంగా అంతా నీ చేతుల్లో లేదని కూడా తేల్చేశారు.
ఇంతకూ రాజకీయాలకూ ఈ రసాయనాలకు ఏమైనా సంబంధముందా అద్యక్షా? ఆ ఎంఎల్ఎ ఎవరినో అంతగా అపహాస్యం చేశాము గదా ఈ మెట్టవేదాంతంపై పెదవి విప్పలేమా?