తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అసంతృప్తితో ఉన్నట్లుగా తేలిపోయింది. శనివారం విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ముప్పాళ్ల గ్రామంలో పర్యటనకు చంద్రబాబు వెళ్లారు. ఆ సమయంలో కొలికపూడి వెళ్లారు కానీ.. చంద్రబాబు ఆయనను పలకరించలేదు. ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేసినా పట్టించుకోలేదు. తర్వాత ప్రజావేదిక వద్దకు కూడా కొలికపూడి వెళ్లలేదు. దీంతో చంద్రబాబు ఆయనపై ఆగ్రహంతో ఉన్నారని క్లారిటీ వచ్చేసింది.
అమరావతి ఉద్యమంలో పని చేశారని చంద్రబాబునాయుడు పిలిచి టిక్కెట్ ఇచ్చారు. ఆయన ఊరు కాకపోయినా తిరువూరుకు చివరి క్షణంలో అభ్యర్థిత్వం ఇచ్చారు. గెలిచేందుకు కావాల్సిన అన్నిరకాల సపోర్టు ఇచ్చారు. ఆయన అభ్యర్థిత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన పార్టీ నేతల్ని సంతృప్తి పరిచారు. కొలికపూడి అదృష్టమో.. టీడీపీ కార్యకర్తల కష్టమో కానీ.. ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఇప్పుడు ఆయన తీరు పార్టీకే భారంగా మారింది. రమేష్ రెడ్డి అనే నేతపై చర్యలు తీసుకోకపోతే రాజీనామా చేస్తానని పార్టీకి అల్టిమేటం జారీ చేయడంతో ఆయన పూర్తిగా పార్టీకి దూరమయినట్లయింది.
తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి పది నెలలు కాక ముందే కొలికపూడి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వైసీపీ నేతలతో కలిసి దందాలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. నియోజకవర్గ టీడీపీ క్యాడర్ అంతా ఆయన వద్దని తీర్మానాలు చేస్తున్నారు. వేరే ఇంచార్జ్ ను నియమించాలని అంటున్నారు. టీడీపీలో ప్రాధాన్యం దక్కించుకున్న కొలికపూడి.. ఇలా వ్యక్తిగత స్వార్థం కారణంగా.. వ్యూహం లేని రాజకీయాలు చేసి.. వెంటనే పరపతి కోల్పోయారని టీడీపీ నేతలే జాలి చూపిస్తున్నారు.