ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలకు ఇప్పుడు చంద్రబాబు పేరు ఎత్తితేనే పుండు మీద కారం రాసినట్లుగా ఉంటుంది. కన్నా నుంచి సోము వీర్రాజు వరకూ అందరిదీ ఇదే వరస. కానీ కొంత మంది మాత్రం ఇప్పుడిప్పుడే మారుతున్నారు. కొద్ది రోజుల క్రితం.. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు నేరుగానే… చంద్రబాబును సచివాలయానికి వచ్చి పొగిడి వెళ్లారు. ఆ తర్వాత చంద్రబాబుపై విమర్శల తీవ్రత తగ్గించారు. పార్టీ కార్యక్రమాల్లోనూ అంతంతమాత్రంగానే పాల్గొంటున్నారు. ఇక నిన్నామొన్నటి వరకూ.. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేయడానికి కూడా వెనుకాడని సీనియర్ నేత కృష్ణంరాజు ఇప్పుడు చంద్రబాబుపై సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారు.
కృష్ణంరాజును.. అంతకు ముందు పెద్దగా బీజేపీ నేతలు పట్టించుకోలేదు కానీ.. కర్ణాటక ఎన్నికల సమయంలో మాత్రం కర్ణాటక అంతా తిప్పి.. అక్కడి తెలుగువాళ్లను ఆకట్టుకోవడానికి బాగానే వాడుకున్నారు. అప్పుడు కృష్ణంరాజు చంద్రబాబుపై తీవ్రమైన విమర్శలు చేశారు. నిన్నామొన్న బెజవాడలోని ఓ హోటల్లో ప్రెస్మీట్… పెట్టి .. బీజేపీతో విడిపోయి.. ఆగమయింది చంద్రబాబేనని తేల్చారు. మళ్లీ గెలవడని తీర్మానించారు. కానీ నిన్న విశాఖకు వెళ్లి చంద్రబాబు.. చాలా కష్టపడుతున్నారని ప్రశంసించేశారు. అంతే కాదు.. చంద్రబాబు అవినీతికి పాల్పడుతున్నారని సింగపూర్లో డబ్బు దాచుకుంటున్నారన్న ఆరోపణలను నమ్మబోనన్నారు.
సహజంగానే ఇతర విషయాల్లో బీజేపీని డిఫెండ్ చేసుకున్నా.. చంద్రబాబు విషయంలో మాత్రం.. కృష్ణంరాజులో స్పష్టమైన మార్పు అయితే కనిపించింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని కూడా కృష్ణంరాజు ప్రకటించారు. నిజంగానే… కృష్ణంరాజుకు పోటీ చేసే ఓపిక లేదు. ఆయన గవర్నర్ పోస్టు కోసం.. మోడీ, అమిత్ షాలకు దరఖాస్తు పెట్టుకుని.. ఎప్పుడు పిలుపు వస్తుందా… అని ఎదురు చూస్తున్నారు. మధ్యలో ఓ సారి సోషల్ మీడియాలో గవర్నర్ కృష్ణంరాజు అంటూ విస్త్రతంగా ప్రచారం జరిగింది. కానీ ప్రయోజం లేకపోయింది. ఇక సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో.. గవర్నర్ల పోస్టులు భర్తీ చేసే అవకాశం లేదని ఫిక్సయ్యారేమో…మరి మెల్లగా టోన్ మార్చేస్తున్నారు.