ఆంధ్రాకి కేంద్ర సాయంపై రాష్ట్ర సర్కారు పోరాటం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. భాజపాతో మిత్రపక్షంగా ఉంటూనే కేంద్రం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది టీడీపీ సర్కారు. దీంతో రాష్ట్రంలోని ఇతర పక్షాలు కూడా కేంద్రం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరి పోరాటం వారు మొదలుపెట్టారు. కేంద్రంపై తెలుగుదేశం పార్టీయే అవిశ్వాసం పెట్టాలంటూ వైకాపా డిమాండ్ చేసింది. ఇంకోపక్క జనసేన ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ లెక్కలు చూస్తోంది. అయితే, ఈ సందర్భంలో కేంద్రంపై ఒత్తిడి పెంచే మార్గాలపై సీఎం చంద్రబాబు ఆచితూచి అడుగేస్తున్నారు. దొరికిన ప్రతీ సందర్భంలోనూ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సాధికార మిత్ర కార్యకర్తలతో సమావేశం సందర్భంగా కేంద్రం తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ, తాను పోరాడతానని స్పష్టం చేశారు.
కేంద్రం ఇంకా డబ్బులు ఇవ్వడం లేదనీ, అయినా తాను వదిలిపెట్టననీ, గట్టిగా పోరాడి తీరతానని చంద్రబాబు అన్నారు. సాధించేవరకూ పోరాడి తీరతానని మరోసారి స్పష్టం చేస్తున్నానన్నారు. ‘మాకు అన్యాయం జరిగింది. చాలా అంశాలు చట్టంలో పెట్టారు. హామీలు ఇచ్చారు. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. మీరు చేసేవరకూ మీపై ఒత్తిడి పెంచే హక్కు మాకు ఉంది. కాబట్టి, వదిలిపెట్టే సమస్యే లేదు’ అని చంద్రబాబు అన్నారు. ఆంధ్రాకి కేంద్రం న్యాయం చేయాలంటూ ఐదుకోట్ల మంది ఒకేమాటగా ఉన్నారన్నారు. గత ఎన్నికల్లో 125 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో రాష్ట్రంలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించి ఒక్క శాతం కూడా ఓట్లు లేకుండా చేశారన్నారు. తమలో ఉండే కసిని ఎక్కడ తీర్చుకోవాలో ప్రజలకు బాగా తెలుసు అన్నారు. ఒక పక్క తాను పనిచేస్తూనే పోరాటం చేస్తానన్నారు.
ఆంధ్రా ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా కేంద్ర నిర్ణయాలు ఉంటే… రాష్ట్రంలో కాంగ్రెస్ కు పట్టిన గతే పడుతుందని పరోక్షంగా కేంద్రాన్ని సీఎం హెచ్చరిస్తున్నట్టుగా ఉంది! అయితే, పనిచేస్తూనే పోరాటం చేస్తానని సీఎం అంటున్నారు కానీ.. ఆ పోరాటం ఏంటనే స్పష్టత ప్రజలకు ఇవ్వాల్సిన సమయం ఇది. అవిశ్వాసాలూ రాజీనామాలూ అంటూ ప్రతిపక్షాలు చాలా ప్రకటనలు చేస్తున్నాయి. అలాగని, అధికార పక్షం.. అందునా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షం అంత సులువుగా తీవ్రమైన నిర్ణయాలు తీసుకోలేదు. ఎందుకంటే, రాష్ట్ర ప్రయోజనాలు కూడా ఆ నిర్ణయంతో ముడిపడి ఉంటాయి కదా! అలాగని, పోరాడకుండా తాత్సారం చేయాల్సిన సమయం కూడా కాదిది. కాబట్టి, కేంద్రంపై టీడీపీ పోరాటం ఏంటనేది మరింత స్పష్టంగా చెబితే బాగుంటుంది.