తెలంగాణ ఎన్నికలలో టిడిపికి ఎదురైన దారుణ పరాభవం తెలుగుదేశం పార్టీ అభిమానులు కలతచెందేలా చేసింది. ఎక్కువ సీట్లలో పోటీ చేయకుండా వ్యూహాత్మకంగా గెలిచే అవకాశాలు బాగా ఉన్న ఒక 13 -14 సీట్లలో మాత్రమే పోటీ చేసి, అందులో సింహభాగం గెలుచుకుంటే ఆ ప్రభావం తదుపరి ఆరునెలలపాటు ఉంటుందని , అది ఆంధ్ర ఎన్నికలలో ఉపయోగపడుతుందని వేసుకున్న లెక్కలు తారుమారయ్యాయి. అయితే ఇప్పుడిప్పుడే ఆ ప్రభావం నుంచి తేరుకుని కారణాలను విశ్లేషించే పనిలో పడ్డారు తెలుగుదేశం అభిమానులు. కాంగ్రెస్ పార్టీ తో పొత్తు పెట్టుకోవడం, హరికృష్ణ కుటుంబానికి చెందిన ఆడపడుచు కి టికెట్ ఇవ్వడం, పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం చేసుకోవడం ఇవేవీ ఫలితాలను ఇవ్వకపోగా బూమరాంగ్ అయ్యాయి. అయితే ఈ కారణాల సంగతి కాసేపు పక్కన పెడితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభిమానుల లో జరుగుతున్న ఒక చర్చ ఏమిటంటే తెలుగుదేశం పార్టీ అవకాశాలను మెరుగు పరచాలంటే ముందు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణని చంద్రబాబు దూరం పెట్టడం, లేదంటే నియంత్రించడం చేసి తీరాలి అన్నది. అసలు ఎప్పుడూ చంద్రబాబును సమర్థిస్తూ, చంద్రబాబుకు అండగా ఉండే మీడియా అధిపతి అయిన రాధాకృష్ణకి దీనికి ఏమిటి సంబంధం అని అనుకుంటున్నారా.. వివరాల్లోకి వెళితే..
బీజేపీకి టీడీపీ కి చెడటానికి ఒక కారణం ఆర్కె:
చంద్రబాబు మోడీ కాంబినేషన్ 2014లో సూపర్ హిట్ అయింది. ఇద్దరూ పని రాక్షసులని, అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని, దేశాన్ని పరుగులు పెట్టిస్తారు అని తెలుగు ప్రజలు అనుకున్నారు. అయితే ఆ తర్వాత వీరిద్దరి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. చివరికి ఈ రెండు పార్టీలు తెగతెంపులు చేసుకోవలసి వచ్చింది.
నిజానికి మోడీ చంద్రబాబుల మధ్య మొదట్లో కాస్త ఈగో పరమైన సమస్యలు ఉన్నప్పటికీ శత్రుత్వం అయితే లేదు. కానీ 2014 ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్ లో బిజెపి బలపడడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇతర పార్టీల నుంచి నాయకులను చేర్చుకోవడం మొదలు పెట్టింది. అయితే అదే సమయంలో అందరికంటే ముందుగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేక కథనాలను మొదలుపెట్టింది ఆంధ్రజ్యోతి. ఒకవైపు చంద్రబాబు మోడీ ల కాంబినేషన్ ని మెచ్చుకుంటూనే ,మరోవైపు నెమ్మది నెమ్మదిగా మోడీ మీద వ్యతిరేకత పెంచే కథనాలు మొదలు పెట్టింది. అయితే స్థానిక బిజెపి నాయకులు ఈ కథనాలను బిజెపి హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి అత్యంత అనుకూలమైన ఈ పత్రికలో వస్తున్న బిజెపి వ్యతిరేక కథనాలు చంద్రబాబు ప్రమేయంతోనే వస్తున్నాయని బీజేపీ పెద్దలు భావించినట్లు సమాచారం. అయితే ఈ ఒక్క కారణంగానే బీజేపీ టీడీపీ ల మధ్య దూరం పెరిగింది అని చెప్పలేం కానీ ,ఇతరత్రా అంతర్గత రాజకీయ కారణాల వల్ల వీరి మధ్య నెలకొన్న క్లాషెస్ మీద ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కథనాలు చమురు పోసిన మాట అయితే వాస్తవం. అది కాస్తా పెరిగి పెరిగి ఎన్డీయే లోంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చే వరకు సాగింది. ఒక రకంగా చూస్తే బీజేపీకి టీడీపీ కి మధ్య ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడడానికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అత్యుత్సాహమే కారణం.
ఒక బలమైన సామాజిక వర్గాన్ని టిడిపికి దూరం చేయడానికి కూడా ఆంధ్రజ్యోతి అత్యుత్సాహమే కారణం:
2014లో టీడీపీకి అండగా నిలిచిన పవన్ కళ్యాణ్ కానీ, జనసేన పార్టీ కానీ, టిడిపితో కొనసాగే పరిస్థితి ఉండి ఉంటే కూడా తెలుగుదేశం పార్టీకి ఈ రోజు ఇంత డైలమా ఉండేది కాదు. అయితే అందరికంటే ముందుగా జనసేన పార్టీ మీద ఎదురుదాడి ప్రారంభించింది ఆంధ్రజ్యోతి పత్రిక. ఆ మధ్య జనసేన పార్టీకి ఒకటి నుంచి మూడు సీట్లు వస్తాయని ఒక వెటకారపు సర్వే ని ప్రచురించడంతో పాటు, జనసేన పార్టీని కేవలం కాపుల పార్టీ గా ప్రొజెక్ట్ చేయడానికి ఆంధ్రజ్యోతి శతవిధాల ప్రయత్నించింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన పవన్ కళ్యాణ్ ఒక బహిరంగ సభలో మా పార్టీ మీద కులం ముద్ర వేయడానికి ప్రయత్నిస్తే మీ ఆంధ్రజ్యోతి పత్రికలో కులాల వారి లెక్కలు బయటపెడతానని హెచ్చరించారు. దాంతో రాధాకృష్ణ కూడా ఏమాత్రం తగ్గకుండా పవన్ కళ్యాణ్ మీద మళ్లీ విమర్శనాస్త్రాలు సంధించారు. దీంతో తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా గా ముద్రపడ్డ ఆంధ్రజ్యోతి ఇలా చేయడానికి కూడా చంద్రబాబు ప్రమేయం ఉండవచ్చని పవన్ కళ్యాణ్ సామాజిక వర్గంతో పాటు మిగతా వారు కూడా నమ్మారు. అలాగే ముద్రగడ పద్మనాభం దీక్షల సందర్భంగా కూడా కాపుల గురించి ఆంధ్రజ్యోతి చేసిన కథనాలు వారికి ఆంధ్రజ్యోతి పత్రిక మీదే కాకుండా చంద్రబాబు మీద కూడా వ్యతిరేకత కలిగించాయి.
చంద్రబాబు తుమ్మితే చాణక్యత తో తుమ్మాడని, దగ్గితే వ్యూహాత్మకంగా దగ్గాడని రాయడం వల్ల కలిగిన చేటు :
ఆంధ్రజ్యోతి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పని చేస్తుంది అన్నది తెలుగు రాష్ట్రాల్లో స్కూల్ పిల్లాడిని అడిగినా కూడా చెబుతారు. చంద్రబాబు తుమ్మినా చాణక్యత తో తుమ్మాడని, దగ్గితే వ్యూహాత్మకంగా దగ్గాడని ఆంధ్రజ్యోతి రాస్తుంది అన్నది ప్రజల్లో ఒక ఉవాచ. ఇలా బాబు ఏం చేసినా సమర్థించడానికి ఆంధ్రజ్యోతి ప్రయత్నించడం దీర్ఘకాలంలో బాబు కి చేటు చేస్తోంది. పైగా చంద్రబాబుని గాల్లోకి ఎత్తడానికి వాస్తవ పరిస్థితిని విస్మరించడానికి సైతం ఈ పత్రిక ఏమాత్రం వెనుతీయదు అనడానికి తెలంగాణ ఎన్నికలకు ముందు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలే నిదర్శనం. ఈరోజు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన పచ్చ మీడియా అన్న పదం కనిపిస్తుంది అంటే దానికి పునాది ఇలాంటి కథనాలే. ఆంధ్ర జ్యోతిని మళ్ళీ ఇలాగే చంద్రబాబు ప్రోత్సహిస్తే భవిష్యత్తులో జరిగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కూడా అది బూమరాంగ్ అవకాశం ఉంది.
మొత్తం మీద:
చిత్తశుద్ధితో పని చేసినప్పుడు, వ్యూహాలు ఎత్తుగడలు అవసరం లేదు. ప్రజలు ఆ చిత్తశుద్ధిని గుర్తిస్తే వారే గెలిపిస్తారు. 2014లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన సగటు ఓటరు అభిప్రాయం- ” తెలంగాణ విడిపోయింది , మనం హైదరాబాదును కోల్పోయాం, కసితో పనిచేసి హైదరాబాద్ ను మించిన రాజధాని కట్టుకొని తెలంగాణ ను మించిన అభివృద్ధి సాధించి, ఐదేళ్లలో ప్రపంచానికి చాటి చెప్పాలి, అలా చేయాలంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు లాంటి నాయకుడు కావాలి”- ఇది ఆనాటి సగటు ఓటరు మనోగతం. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో చంద్రబాబు గనక సఫలమయి ఉంటే ఈ రోజు ఈ విశ్లేషణ అంతా అవసరం ఉండేది కాదు. అయితే ఆ అంచనాలు అందుకోలేక పోయినా, ఉన్నంతలో అన్ని వర్గాలను కలుపుకుంటూ , అందరినీ అభివృద్ధి లో భాగస్వామ్యం చేస్తూ , వీలైనంతవరకు అందరినీ సంతృప్తి పరుస్తూ ముందుకు కొనసాగి ఉన్నా కాస్త ఫలితం ఉండేది కానీ ఆంధ్రజ్యోతి ఆర్కే లాంటి వాళ్ళ అత్యుత్సాహం వల్ల ఒక్కొక్క వర్గం తెలుగుదేశం పార్టీ నుంచి దూరం అవడానికి బీజాలు పడ్డాయి.
మరి చంద్రబాబు ఇప్పటికైనా తేరుకుంటాడా లేకపోతే అనుంగు మీడియా ని నమ్ముకుని 2019 ఎన్నికలలో “ఆ విధంగా ముందుకు పోతాడా” అన్నది వేచి చూడాల్సి ఉంది.
– జురాన్ ( CriticZuran)