జనాభాను పెంచడానికి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడటం లేదు. ఇప్పటి వరకూ ఇద్దరు పిల్లల వరకూ ప్రసూతి సెలవులు లభిస్తున్నాయి. ఇక నుంచి ఎంత మందిని కన్నా ప్రసూతి సెలవులు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. చంద్రబాబు మహిళా దినోత్సవం రోజు ఇలాంటి ప్రకటన చేయడానికి కారణం ఉంది. ఒక రోజు ముందు హోంమంత్రి అనితను.. మూడో బిడ్డను కనడానికి ప్రసూతి సెలవులు వర్తిస్తాయా అని ఓ మహిళా కానిస్టేబుల్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు.
జనాభా తగ్గిపోవడం వల్ల దక్షిణాదికి అన్యాయం జరుగుతోందన్న వాదనను సీనియర్ నేతలు తీసుకు వస్తున్నారు. చంద్రబాబు, స్టాలిన్, రేవంత్ రెడ్డి ఇదేచెబుతున్నారు. చంద్రబాబు, స్టాలిన్ పిల్లల్ని కనాలని ప్రోత్సహిస్తున్నారు. వారి ఉత్సాహం చూస్తూంటే త్వరలో పిల్లల్ని కన్నందుకు ప్రోత్సాహకాలు కూడా ప్రకటించేలా ఉన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ప్రసూతి సెలవుల ఆఫర్ ఇచ్చారు. ప్రస్తుత రోజుల్లో ఒకరిని కని పెంచడమే జంటలకు కష్టమవుతోంది. పెరిగిపోతున్న జీవన ప్రమాణాలు.. వాటికి తగ్గ ఖర్చుల ఆదాయం కోసం.. భార్యభర్తలు ఇద్దరూ కష్టపడాల్సిందే.
పెళ్లిళ్లు కూడా30 ఏళ్ల తర్వాతే అవుతున్నాయి. పిల్లల్ని కనేసరికి నలభైల దగ్గరకు వస్తున్నారు. పిల్లలను చూసుకునేందుకు పెద్దలు కూడా అందుబాటులో ఉండటం లేదు. ఇలాంటి కారణాలతో పిల్లలను తగ్గించుకుంటూ వస్తున్నారు. ప్రపంచ జనాభాను పెంచేందుకే పిల్లల్ని కంటున్నానని అది తన బాధ్యత అని ఎలాన్ మస్క్ చెప్పుకున్నట్లుగా .. తమ బాధ్యతగా ప్రజలు రాష్ట్ర జనాభాను పెంచడానికి సిద్ధమయ్యే చాన్స్ లేదు. కానీ సీనియర్ ముఖ్యమంత్రులు మాత్రం తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు.