నెల రోజుల్లోపే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవనుంది. ఈ లోపే .. మరిన్ని ప్రజాకర్షక నిర్ణయాలు పథకాలకు ఆమోద ముద్ర వేయనుంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లో రైతులకు వరాలు జల్లు కురిపించనున్నారు.. ఇప్పటికే తెలంగాణా లో రైతు బంధు పేరుతో అమలవుతున్న స్కీం లాంటిదే ఎపిలో పెట్టే అలోచన చేస్తున్న ప్రభుత్వం.. దానికి కావాల్సిన విధివిధాలపై నేటి మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోనున్నారు. అన్నదాత సుఖీభవ పేరుతో.. ఏపీలోని రెండు కోట్ల ఎకరాల భూములకు.. ఎకరానికి రూ. 2,500 చొప్పున పంపిణీ చేయాలనే నిర్ణయానికి ఆమోద ముద్ర వేసే అవకాశంఉంది. ఇప్పటికే దీనిపై పలుధపాలుగా చర్చించిన ప్రభుత్వం.. మంత్రి వర్గం భేటీలో ఫైనల్ చేస్తారు.
ఏపీలో సాగులో ఉన్న 2 కోట్లకుపైగా ఎకరాలకు.. రూ.2,500 చొప్పున సుమారు రూ.5వేల కోట్లు అందజేయనుంది. ఈ మొత్తాన్ని అసలు రైతులు కౌలు రైతులకు ఎలా పంచాలన్న అంశంపై సర్కారు తుది కసరత్తు చేస్తోంది. సామరస్యంగా కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియ చేపట్టాలని భావిస్తోంది. అసలు రైతులే సాగుచేస్తున్న చోట ఎకరానికి రూ.2,500 చొప్పున వారికే చెల్లిస్తారు. కౌలు రైతులున్న చోట సగం, సగం చెల్లించాలే ప్రతిపాదనపై కసరత్తు చేస్తున్నారు. ఎన్నికలకు ముందుగానే తొలి విడత రైతులకు ఎకరానికి రూ.2,500 చొప్పున పంపిణీ చేస్తారు. ఖరీఫ్, రబీ సీజన్లకు వేర్వేరుగా.. అందిస్తారు ఐదు వేలు అందుతాయి. వచ్చే ఏడాది నుంచి ఎకరానికి రూ.5,000 చొప్పున ఏడాదికి ఎకరానికి రూ.10వేలు ఆర్థికసాయం అందజేయాలన్నది ప్రతిపాదన. ఆ లెక్కన 2కోట్ల ఎకరాలకు ఏటా రూ.20వేల కోట్లు అందజేయాల్సి ఉంటుంది. పథకం వల్ల రాష్ట్రంలోని 96 లక్షలకుపైగా ఉన్న రైతులు, కౌలు రైతులకు మేలు జరగనుంది.
ఎన్నికల ప్రకటన ఎప్పుడైనా రావొచ్చనే అంచనాల మధ్య.. కోడ్ అమల్లోకి రాక ముందే ప్రజాకర్షక నిర్ణయాలు తీసుకోవాలన్న ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఉంది. అసైన్డ్ భూములు, చుక్కల భూములపై మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుని అందర్నీ సంతృప్తి పరచబోతున్నారు. అగ్రిగోల్డ్ డిపాజిటర్లకూ.. కొంత మొత్తం కేటాయించబోతున్నారు.