ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇప్పుడు నెంబర్ వన్ విలన్ భారతీయ జనతా పార్టీ. ఆ పరిస్థితి చంద్రబాబే తెచ్చారని.. బీజేపీ నేతలకు మంట. కాదు.. హమీలు అమలు చేయకుండా.. వారే ఆ పరిస్థితి తెచ్చుకున్నారని టీడీపీ నేతలు చెబుతూంటారు. టీడీపీపై .. చంద్రబాబుపై ఎలాగైనా కసి తీర్చుకోవాలనేది బీజేపీ నేతల ఆరాటం. అందుకే… జీవీఎల్ నరసింహారావు దగ్గర్నుంచి సోము వీర్రాజు వరకూ.. అందరూ చంద్రబాబును టార్గెట్ చేసుకుని తిడుతూనే ఉంటారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు బస్సులో వెళ్లి అవే విమర్శలు చేశారు. ఒక్క పైసా నిధులు ఆపలేదనే దగ్గర్నుంచి…మోదీ ఫోటో పెట్టలేదని నిష్ఠూరమాడటం వరకు… అన్ని విమర్శలు చేశారు.
మామూలుగా అయితే బీజేపీ నేతలకు.. టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చేవారు. కానీ చంద్రబాబు మాత్రం.. బీజేపీ నేతల తీరు విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే వారికి సమాధానం ఇస్తే… అది రాజకీయం అయిపోతుంది. అందుకే.. నేరుగా ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్‌కు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అనుమతలన్నీ చెబుతూ లేఖ రాసేశారు. ప్రాజెక్ట్ విషయంలో కేంద్రం నుంచి ఎంత రావాల్సి ఉందో సమగ్రంగా వివరిస్తూ.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ఓ లేఖ పంపారు. అందులో ప్రాజెక్ట్ పూర్తవడానికి కేంద్రం ఏమేం చేయాల్సి ఉందో వివరించారు. పోలవరం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధుల్లో ఇంకా..రూ. 1504 కోట్లు విడుదల కావాల్సి ఉందన్నారు. తక్షణమే ఆ నిధులను విడుదల చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించిన రెండో డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర జల వనరుల సంఘం అడిగిన అన్ని వివరాలను ఇచ్చామని లేఖలో గుర్తు చేశారు.
పోలవరం విషయంలో ఇతర పార్టీల నుంచి వస్తున్న విమర్శల విషయంలో చంద్రబాబు ఏ మాత్రం సహనంగా ఉండే అవకాశం కనిపించడం లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ పై రాళ్లేసేందుకు చాలా మంది… ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ చిన్న ఇబ్బంది వచ్చి పోలవరం పనులకు బ్రేక్ పడినా.. ముందుకు సాగడం అసాధ్యమనేది చంద్రబాబు భయం. అందుకే… ఆయన పోలవరం విషయాన్ని మాత్రం చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఏ చిన్న ఆరోపణ వచ్చినా.. ముఖ్యంగా బీజేపీ నేతలు చేసే ఆరోపణలపై.. పూర్తి సమాచరంతో కౌంటర్ బయటకు వచ్చేలా చేస్తున్నారు.